Flexi-Cap Funds Shine: అక్టోబర్ నెలలో నిఫ్టీ 50 సూచీ బలంగా నిలిచినా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మాత్రం తగ్గాయి. తాజా AMFI గణాంకాల ప్రకారం.. ఈక్విటీ స్కీముల నికర ఇన్‌ఫ్లో రూ.24,690 కోట్లు కాగా.. సెప్టెంబర్‌లోని రూ.30,422 కోట్లతో పోలిస్తే సుమారు 19 శాతం తక్కువ. మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రూ.79.87 లక్షల కోట్లకు పెరగగా.. ఇందులో ఈక్విటీ ఫండ్స్ రూ.35.16 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఇన్‌ఫ్లోలు తగ్గినా పెట్టుబడిదారుల ధైర్యం కనబడింది. ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, థీమాటిక్ క్యాటగిరీల్లో పెట్టుబడులు నిలకడగా కొనసాగడం భారత మార్కెట్‌పై దీర్ఘకాల నమ్మకాన్ని సూచిస్తుందని క్లైంట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ సరీన్. అలాగే ఇది వరుసగా మూడో నెల ఈక్విటీ ఇన్‌ఫ్లో తగ్గుదలను పేర్కొంటుంది. మార్కెట్‌లలో ఉన్న బలమైన ర్యాలీకి లాభాలను బుక్ చేసుకునేందుకు పెట్టుబడిదారులు మెుగ్గుచూపిన ధోరణిని ప్రధాన కారణంగా నిపుణులు చూస్తు్న్నారు.
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మాత్రం దీన్ని తలదన్నాయి. అక్టోబర్‌లో ఈ ఫండ్లకు రూ.8,929 కోట్ల నికర ఇన్‌ఫ్లో వచ్చింది. ఇది సెప్టెంబర్ కంటే ఎక్కువ. మిడ్ క్యాప్ ఫండ్లకు రూ.3,807 కోట్లు, స్మాల్ క్యాప్‌లకు రూ.3,476 కోట్లు మాత్రమే వచ్చినట్లు డేటా చెబుతోంది. ఇక లార్జ్ క్యాప్ ఫండ్ల ఇన్‌ఫ్లో రూ.972 కోట్లకు పరిమితమైంది. ELSS స్కీములు రూ.666 కోట్ల నికర అవుట్‌ఫ్లో నమోదు చేశాయి. హైబ్రిడ్ ఫండ్లలో అక్టోబర్‌లో రూ.14,156 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది.
పాసివ్ ఫండ్స్ మంచి గమనం సాధించాయి. వీటిలో రూ.16,668 కోట్ల నికర ఇన్‌ఫ్లో నమోదైంది. గోల్డ్ ETFలు రూ.7,743 కోట్లను ఆకర్షించి మొదటిసారిగా రూ.లక్ష కోట్లకు పైగా AUM సాధించాయి. జియోపాలిటికల్ రిస్క్‌లు, వడ్డీరేట్ల అనిశ్చితి మధ్య బంగారం పెట్టుబడిదారులకు సురక్షిత ఆశ్రయం అయిందని మోర్నింగ్‌స్టార్ ఇండియా నేహాల్ మేశ్రామ్ అన్నారు. మెుత్తానికి అక్టోబర్‌లో SIP ఇన్‌ఫ్లో రూ.29,529 కోట్లకు చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే హైబ్రిడ్, పాసివ్ ఫండ్స్ ఇన్వెస్టర్ల మనస్సులను అక్టోబరులో కొల్లగొట్టాయి.


