Flipkart to enter food delivery services soon: ఫుడ్ డెలివరీ సేవల్లో స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతోంది. దేశంలోనే తొలిసారి బెంగళూరు నగరంలో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 కంటే ముందే ఈ సేవలు ప్రారంభించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రెస్టారెంట్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించిందని ఆంగ్ల వెబ్‌సైట్ ‘మనీకంట్రోల్’ వెల్లడించింది. ప్రస్తుతం, ఫుడ్ డెలివరీ సంస్థలు రెస్టారెంట్ల, హోటళ్ల నుంచి 16 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను తీసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ మాత్రం 10 శాతం కమీషన్‌తో రెస్టారెంట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తొలుత బెంగళూరు నగరంలో ప్రయోగాత్మకంగా ఈ సేవలను పరీక్షించిన అనంతరం తమ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనుంది. కొన్ని వారాల్లో ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి ప్రకటించారు. కొద్దిరోజులకే ఆ గ్రూప్ తన సేవలను వేగవంతం చేయడం గమనార్హం.
Also Read: Cricket : టీమిండియా రీఎంట్రీపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
మార్కెట్‌ను శాసిస్తోన్న జొమాటో, స్విగ్గీ..
గతంలో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో సేవలను ప్రారంభించిన తరహాలోనే పరిమిత సంఖ్యలో ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. వారి నుంచి అభిప్రాయాలు తీసుకుని, ఎప్పటికప్పుడు సేవలను మెరుగుపరుచుకుంటూ దశలవారీగా విస్తరించనుంది. ఫ్లిప్‌కార్ట్ తన మెయిన్ యాప్‌తో పాటు, ఫుడ్ డెలివరీ విభాగం కోసం ప్రత్యేకంగా మరో యాప్‌ను కూడా లాంచ్ చేయనుంది. ప్రస్తుతం, జొమాటో, స్విగ్గీ సంస్థలు ఫుడ్ డెలివరీ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇటీవల రాపిడో కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి పోటీని మరింతగా పెంచింది. ఇప్పుడు వాల్‌మార్ట్ వంటి దిగ్గజ సంస్థకు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడంతో మరోసారి ఫుడ్ డెలివరీ విభాగంలో పోటీ తీవ్రం నెలకొంది.

