Budget 2026: దేశంలో క్రిప్టో కరెన్సీల భవిష్యత్తు ఇప్పుడు కేంద్ర బడ్జెట్ 2026 చుట్టూ తిరుగుతోంది. 2022లో కేంద్రం క్రిప్టో లావాదేవీలపై పన్నులు విధించినప్పటి నుంచి.. ఈ రంగం ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చెందుతోంది. అయితే కేవలం పన్నులకే పరిమితం కాకుండా, ఈ రంగాన్ని పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించాలనే డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. భారత్‌లో ఉన్న అపారమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, ప్రభుత్వం ఒక సమతుల్యమైన విధానాన్ని ప్రకటిస్తే.. భారత్ ప్రపంచ క్రిప్టో మ్యాప్‌లో కేవలం వినియోగదారుగానే కాకుండా ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుందని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ వంటి నిపుణుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
నిజానికి 2022 బడ్జెట్‌ను క్రిప్టో రంగానికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. అప్పటి వరకు క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ.. కేంద్రం లాభాలపై 30% పన్నును, అలాగే 1% TDSని ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రభుత్వం క్రిప్టోను అధికారికంగా గుర్తించడమే కాకుండా.. ప్రతి లావాదేవీకి ఒక ‘డేటా ట్రైల్’ ఏర్పడేలా చేసింది. ఇది ఆర్థిక నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. అయితే పన్నులు భారంగా ఉన్నాయని భావించినా, భారతీయ ఇన్వెస్టర్లు క్రిప్టోపై తమకున్న మక్కువను తగ్గించుకోలేదు. 2024-25 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్‌లో భారత్ మొదటి స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆన్-చైన్ లావాదేవీల విలువ 2025 నాటికి $2.36 ట్రిలియన్లకు చేరింది. స్పష్టమైన చట్టాలు లేకపోయినా.. ఇండియన్స్ ఈ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో ముందున్నారని ఇది స్పష్టం చేస్తోంది.
also read Loan EMI Relief: ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్నా EMI కట్టాల్సిన పనిలేదు..!
రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి క్రిప్టో పరిశ్రమ మూడు ప్రధాన అంశాలను ఆశిస్తోంది. మొదటిది వినియోగదారుల రక్షణ కోసం ఒక ప్రత్యేక ‘నోడల్ ఏజెన్సీ’ని ఏర్పాటు చేయడం. రెండోది ప్రస్తుతం ఉన్న 1% TDSని తగ్గించడం ద్వారా మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడం. ఇక మూడోది టోకనైజేషన్ వంటి సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం. వీటిపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు వెలువడతాయో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

