Foresx Reserves High: భారత విదేశీ మారక నిల్వలు తాజాగా వారాంతపు ప్రాతిపధిక సరికొత్త రికార్డు గరిష్ఠాన్ని తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రకటన తర్వాత ఇదే తొలిసారిగా మారక నిల్వలు పెరగటం గమనార్హం. వాస్తవానికి ఇటీవల డాలర్ విలువను కోల్పోవటం.. రానున్న సెప్టెంబర్ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలు రూపాయి డాలర్ మధ్య మారకపు విలువపై ఒత్తిడిని తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు.
ఆగస్టు 8తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 4.75 బిలియన్ డాలర్లు పెరిగి మెుత్తంగా రూ.693.62 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. దీనికి ముందు ఆగస్టు 1తో ముగిసిన వారంలో ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ కేవలం 688.87 బిలియన్ డాలర్లుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో బంగారం నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పెరిగి వారంలో 86.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఇక ఇదే కాలంలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 169 మిలియన్ డాలర్లు పెరిగి 18.74 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద భారత డబ్బు రిజర్వులను 45 మిలియన్ డాలర్లు పెంచుకుని 4.73 బిలియన్ డాలర్లకు పెరిగాయని వెల్లడైంది. ఇది రూపాయికి బలాన్ని పెంచటంతో పాటు విదేశీ దిగుమతులపై చేయాల్సిన చెల్లింపులకు అండగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి వ్యాపార వాతావరణంలో విదేశీ మారకపు నిల్వలు బలంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంక్ దానికి అనుగుణంగానే తన నిల్వలను పెంచుకుంటోందని.. ఇది భవిష్యత్తులో విదేశీ నిల్వల కొరత లేకుండా చెల్లింపులు చేపట్టేందుకు అలాగే లోటును భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.


