Gold and silver prices have dropped: గత కొంత కాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు ఇవాళ దిగొచ్చాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన పసిడి ధర రూ.4300 క్షీణించి రూ.1.56 లక్షలకు (అన్ని పన్నులూ కలిపి) చేరింది. కిలో వెండి సైతం దాదాపు రూ.10 వేలు తగ్గి రూ.2.45 లక్షలకు చేరుకుంది. క్రూడాయిల్ ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం వల్ల డిమాండ్ తగ్గి బంగారం, వెండి ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రోజు వ్యవధిలో 90 డాలర్లు క్షీణించి 4168 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 2.24 శాతం క్షీణించి 63.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Minister Uttam: సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు మరో రూ.200 కోట్లు.. మంత్రి ఉత్తమ్ వెల్లడి
డాలర్ బలోపేతంతో తగ్గుతున్ను బంగారం..
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఘర్షణలు ప్రారంభం కావడంతో క్రూడాయిల్ ధర మరోసారి 90 డాలర్ల ఎగువకు చేరింది. దీనికితోడు అమెరికా డాలర్ బలోపేతం కావడంతో బంగారం ధరలు దిగి వచ్చాయని పీఎల్ వెల్త్ ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఆఫీస్ ఇఎడ్ రాజ్‌కుమార్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు, దీర్ఘకాలం అధిక వడ్డీ రేట్లు కొనసాగే అవకాశం ఉండడం వల్ల బంగారం, వెండికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని చెప్పారు. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలూ కారణమని లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ పేర్కొన్నారు.

