Gold only for 10k: మన భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలు బంగారాన్ని తెగ ఇష్టపడుతుంటారు. ఒంటినిండా బంగారం ధరించి ధగధగా మెరవాలని కలలు కంటుంటారు. అయితే, బంగారం సామాన్యులకు అందనంత ఎక్కుకు ఎదిగిపోయింది. రోజురోజుకూ బంగారం ధరలు కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు ఉంది. ఇంకా తులం బంగారం రూ.2 లక్షల వరకు వెళ్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, బంగారంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు మాత్రమే ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, ఇవే కాకుండా 18, 20, 9 క్యారెట్ల బంగారం కూడా ఉందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే, బంగారం క్యారెట్లు తగ్గే కొద్ది వాటితో మీరు ఐటెమ్స్ చేయించుకుంటే తక్కువ బడ్జెట్‌లోనే మీకు ఆభరణాలు లభిస్తాయి. కేవలం రూ.10 వేలతో మీరు బంగారం వస్తువులు తయారు చేయించుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఈ క్యారెట్ల బంగారంతో అద్భుతమైన నగలు..
24 క్యారెట్ల బంగారం అనేది స్వచ్ఛమైన బంగారం. ఇందులో 99.99% శాతం బంగారం ఉంటుంది. అదే 22 క్యారెట్లలో 91.60% బంగారం ఉంటుంది. మిగిలినవి ఇతర లోహాలు కలిపి తయారు చేస్తారు. 18 క్యారెట్లలో 75 శాతం బంగారం ఉంటుంది. ఇందులో 25 శాతం లోహాలు కలుపుతారు. అదే 20 క్యారెట్లలో అయితే 83.30% బంగారం, 16.70% ఇతర లోహాలు ఉంటాయి. ఎక్కువగా ఆభరణాలను 18 క్యారెట్లతో తయారు చేస్తారు. అయితే, వీటిన్నింటి కంటే 9 క్యారెట్ల బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ 9 క్యారెట్ల బంగారంతో నగలు చేయించుకుంటే డైలీ కూడా ధరించవచ్చు. అయితే, ఇందులో కేవలం 37.5% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుందని గుర్తించాలి. మిగిలిన 62.5% ఇతర లోహాలు ఉంటాయి. ప్రస్తుతం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షలు ఉంది. అదే 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40 వేల వరకు ఉంటుంది. అదే మీరు దీంతో నగలు చేయించుకుంటే చాలా తక్కువ ధరకే బంగారు ఆభరణాలను ధరించవచ్చు.
తక్కువ బడ్జెట్లో ఎక్కువ బంగారం..
ఉదాహరణకు మీరు 2.5 నుంచి 3 గ్రాముల బరువున్న ఉంగరం లేదా చెవిపోగులు చేసుకుంటే రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చు అవుతుంది. 5 గ్రాముల నగలు చేయించుకుంటే దాదాపుగా రూ.20 వేలు అవుతాయి. ఇలా మీరు తక్కువ బడ్జెట్‌కే ఎక్కువగా బంగారం నగలు చేయించుకోవచ్చు. అయితే, ఈ 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తెలిపింది. ఈ ఏడాది జూలై నుంచి 9 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్‌మార్క్ లేకుండా ఎవరూ అమ్మడానికి వీల్లేదని కోరింది. అయితే, ఈ హాల్‌మార్కింగ్ అనేది స్వచ్ఛతను తెలియజేస్తుంది. దీనివల్ల కస్టమర్లను మోసం చేసే అవకాశం పెద్దగా ఉండదు.


