Today Gold Rate : బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం, అమెరికా డాలర్ బలపడడం వల్ల పసిడి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు.
బంగారం ధరలు ఈ మధ్యకాలంలో శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.836 (0.69%) తగ్గి 10 గ్రాములకు రూ.1,20,573కు చేరింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.1,19,916గా నమోదైంది. డాలర్ ఇండెక్స్ 0.08% పెరిగి 99.95 వద్ద స్థిరపడింది.
అమెరికా-చైనా వాణిజ్య పరిణామాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అవకాశాలు తగ్గడంతో బంగారం రేట్లు పడిపోయాయి.
ALSO READ: RAM: మాకు ఈ ట్యాగ్స్ ఒద్దు, పాతవే ముద్దు అంటున్న చరణ్, రామ్!
పసిడి విశ్లేషకులు “డాలర్ మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరడంతో బంగారం ఔన్సుకు 4,000 డాలర్లకు చేరింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల కీలక ఆర్థిక డేటా విడుదల కాకపోవడంతో, డిసెంబర్ పాలసీ సమావేశం ముందు ఫెడ్ అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాలతోనే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి డిమాండ్ మారుతోంది” అని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుడైన చైనా, తాజాగా గోల్డ్ రిటైలర్లకు పన్ను మినహాయింపు రద్దు చేసింది. ఇది చైనాలో బంగారం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం, సెంట్రల్ బ్యాంకులు 2025 మూడో త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు 28% పెంచాయి.
అయితే అమెరికా-చైనా, అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు కొనసాగుతుండటంతో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ధర రూ.1,18,000 నుంచి రూ.1,24,000 మధ్య ఊగిసలాడుతోంది.
నవంబర్‌లో బలహీనపడిన రూపాయి, కామెక్స్‌లో బంగారం 4,010 డాలర్ల పైన ఉండటం పసిడి ధరకు మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల కీలక డేటా విడుదల కాకపోవడంతో ఇన్వెస్టర్లు మాన్యుఫ్యాక్చరింగ్, నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ PMI గణాంకాల కోసం ఎదురుచూస్తున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ మాట్లాడుతూ “డాలర్ బలం, వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరలను దెబ్బతీశాయి” అన్నారు. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ “నవంబర్ ముందు ధరలు స్థిరంగా ఉంటాయి” అని అంచనా వేశారు. నిపుణులు మాత్రం “ఇప్పుడు కొనుగోలు మంచిది” అని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గినా, ముందు ముందు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


