Gold and silver rates today in Telugu states : పసిడి ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులతో దోబూచులాడుతున్న బంగారం ధరలు బుధవారం నాటికి మరింత ప్రియమయ్యాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ నగలు చేయించుకోవాలనుకునే సామాన్యుడికి ఈ ధరల పెరుగుదల మింగుడుపడటం లేదు.
మళ్లీ పెరిగిన బంగారం: బులియన్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ సహా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు నగరాల్లో పసిడి ధరలు పుంజుకున్నాయి. ‘క్యాప్స్ గోల్డ్’ వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం రూ.1,54,250 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర బుధవారం నాటికి రూ.910 ఎగబాకి రూ.1,55,160కు చేరింది.
ఇక ఆభరణాల తయారీకి విరివిగా వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,240 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం అత్యంత మృదువుగా ఉండి ఆభరణాల తయారీకి వీలుపడదు కాబట్టి, నగల ప్రియులు ఎక్కువగా 22 క్యారెట్ల వైపే మొగ్గు చూపుతారు.
వెండి కాస్త ఊరట: బంగారం భగ్గుమన్నా.. వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. మంగళవారం కిలో రూ.2,34,890గా ఉన్న వెండి ధర బుధవారానికి రూ.535 తగ్గి రూ.2,34,355 వద్ద స్థిరపడింది.
నిపుణుల సూచనలు: బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ‘బీఐఎస్ హాల్‌మార్క్ (BIS 916)’, 6 అంకెల హెచ్‌యూఐడీ (HUID) ముద్రను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొనుగోలు రశీదులో తరుగు, మజూరీ (మేకింగ్ ఛార్జీలు), జీఎస్టీ వివరాలను సరిచూసుకోవడం శ్రేయస్కరం.

