EPF: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.25,000కు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. కాలంతో పాటు జీవన వ్యయం భారీగా పెరిగినప్పటికీ గత దాదాపు 12 ఏళ్లుగా గరిష్ఠ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో వేతన పరిమితిని పెంచాలని కోరుతూ కొన్నేళ్లుగా కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పలుమార్లు చర్చించిన కార్మిక శాఖ.. వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కొత్తగా ఈపీఎఫ్-26 పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్‌వో (EPFO).. గరిష్ఠ వేతన పరిమితి పెంపునకు సైతం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కనీస పింఛను పెంపు అంశం కూడా పరిశీలనలో ఉంది.
వేతన జీవులకు కలిగే లాభాలు: ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి (Cabinet) ఆమోదం లభించిన తర్వాత.. ఈపీఎఫ్‌వో పథకంలో అవసరమైన మార్పులు చేసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదంతో ఇది అధికారికంగా అమల్లోకి రానుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు, కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. గరిష్ఠ వేతన పరిమితి రూ.25,000కు పెరిగితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో జమయ్యే మొత్తం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పరిమితి రూ.15,000 ఉన్నప్పుడు ఉద్యోగి వేతనం నుంచి 12% చొప్పున నెలకు రూ.1,800 జమ అయ్యేవి. ప్రస్తుత పెంపుతో రూ.25,000పై 12% చొప్పున ఉద్యోగి వాటా కింద జమ అయ్యే మొత్తం రూ.3,000కు పెరుగుతుంది. ఉద్యోగితో పాటు సమానంగా యజమాని (Employer) కూడా 12% మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇందులో 8.33% పింఛను నిధికి (EPS) వెళ్లగా, మిగతా మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో మరింత ఎక్కువ మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందనున్నాయి.
Also Read-UPI: యూపీఐ వాడేవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఇది తప్పనిసరి

