GST Effect on Royal Enfield Price Cut: యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రయ్ మంటూ వెళ్లడం ఎంతో మంది యూత్ కల. అయితే, దీని ధర కాస్త ఎక్కువగా ఉండటంతో సామాన్యులు, మధ్య తరగతి వారు కొనుగోలుకు వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఆ కంపెనీ 350 సీసీ మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించింది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయని కంపెనీ పేర్కొంది. జీఎస్టీ ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు అందిస్తున్నట్లు, తద్వారా ఎంపిక చేసిని అన్ని వేరియంట్లపై ధర తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
10 శాతం తగ్గిన జీఎస్టీ..
కేంద్ర ప్రభుత్వం తాజాగా 350 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇలా 10 శాతం జీఎస్టీ తగ్గడంతో 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోడళ్లకు ఇకపై 40 శాతం పన్ను వర్తిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇతర టూవీలర్ కంపెనీల్లానే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన పాపులర్ మోడళ్ల ధరలు తగ్గించింది. కంపెనీ తాజా నిర్ణయంతో క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350 మోడళ్ల ధరలు రూ.22 వేల వరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం క్లాసిక్ 350 మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.1,97,253 నుంచి 2,30,000 వరకు ఉంది. హంటర్ ధర రూ.1,49,900 నుంచి ప్రారంభమై రూ.1,74,655 వరకు ఉంది. మరోవైపు, 350 సీసీ మోడళ్లపై జీఎస్టీ తగ్గించడం వల్ల మోటార్ సైకిళ్ల ధరలు తగ్గడమే కాకుండా.. తొలిసారి బైకులను కొనుగోలు చేయాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి.గోవిందరాజన్ పేర్కొన్నారు. జీఎస్టీ ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకే ఇస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో 350 సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్ల ధరలు సైతం పెరగనున్నాయి.
అదే బాటలో మరిన్ని ఆటోమొబైల్ సంస్థలు..
జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో సెప్టెంబర్ 22 నుంచి తమ మోటార్ సైకిళ్ల ధరలు తగ్గిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. వివిధ మోడళ్లపై రూ.15,743 వరకు ధర తగ్గిస్తున్నట్లు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్, గ్లామర్, ఎక్స్‌ట్రీమ్, జూమ్, డెస్టినీ, ప్లెజర్+ పేరుతో మోటార్ సైకిళ్లు, స్కూటర్లు విక్రయిస్తోంది. కంపెనీ తాజా నిర్ణయంతో ఆయా మోడళ్ల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే టీవీఎస్, బజాజ్ ఆటో కంపెనీలు సైతం ఇదే తరహా ప్రకటనలు చేశాయి. ఏదేమైనా జీఎస్టీ తగ్గింపుతో రాబోయే దసరా, దీపావళి పండగల వేళ ఆటోమొబైల్ షోరూంలు కొనుగోలుదారులతో కళకళలాడనున్నాయి. దీంతో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరింత వృద్ధి చెందనుంది.


