GST on Insurance: ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు లేదా రద్దు అంశం ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉంది. ఈ దీపావళి నాటికి మార్పులు రావచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల వంటి పాలసీలపై 18% పన్ను విధించబడుతోంది. దీనివల్ల సాధారణ కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు బీమా పాలసీలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం 2047 నాటికి “ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్” అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో ఇండస్ట్రీ కోరుతున్నట్లు కొంత పన్ను ఉపశమనం అవసరం.
ఒక కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏడాదికి రూ.50,000 ఉంటే.. ప్రస్తుతానికి 18% జీఎస్టీతో కలిపి రూ.59,000 చెల్లించాల్సి వస్తోంది. ఈ పన్ను తగ్గితే లేదా పూర్తిగా ఎత్తేసినా ప్రీమియం ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఉదాహరణకు 5% జీఎస్టీ విధిస్తే పాలసీరూ. 52,500కే ప్రజలు కొనుక్కోవచ్చు. దీంతో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, అర్థపట్టణ ప్రాంతాల ప్రజలు కూడా బీమాపై ఆసక్తి చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీలను వెంటాడున్న ఆందోళన..
పూర్తిగా జీఎస్టీ రద్దయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వెసులుబాటు ఉండదు. టాక్స్ క్రెడిట్ ద్వారా వారు ఇతర సేవల కోసం చెల్లించిన జీఎస్టీని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేకపోతే వారి ఆపరేటింగ్ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అందువల్ల జీఎస్టీనికి ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై పూర్తి రద్దు కంటే.. 5% వంటి తక్కువ పన్ను ఉంటేనే వ్యాపార పరంగా సుస్థిరంగా కొనసాగగలమని కంపెనీలు భావిస్తున్నాయి. నిజంగా టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం లేకపోతే లాభాల మార్జిన్లను తగ్గకుండా కాపాడుకునేందుకు సంస్థలు తిరిగి ప్రీమియం రేట్లను పాలసీలకు పెంచాల్సి ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇప్పటికీ ఇన్సూరెన్స్ కొంటున్న ప్రజల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా బీమా వినియోగదారుల సంఖ్య పెరిగి, కొత్త పాలసీదారులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, తొలిసారి ఇన్సూరెన్స్ తీసుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. మరో పక్క ఆరోగ్య ఖర్చులు పెరగటం దేశంలో మెడికల్ ద్రవ్యోల్బణం 14 శాతానికి చేరటంపై కూడా ఆందోళనలు పెంచుతున్నాయి. ప్రజలు పెరుగుతున్న ఖర్చులను భరించలేక ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉండటంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం తప్పనిసరిగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే జీఎస్టీ నిర్ణయం ఈ రంగాన్ని ఎలా నడిపిస్తుందనే అంశాలను వేచి చూస్తేనే తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.


