GST Tribunal cracks the whip on Mahesh Babu AMB Cinemas: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు చెందిన మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌కు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ భారీ షాకిచ్చింది. తగ్గిన పన్ను ప్రయోజనాలను ప్రేక్షకులకు ట్రాన్స్‌ఫర్ చేయకుండా యాంటీ-ప్రొఫిటీరింగ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ గుర్తించింది. ఇందుకు గానూ సుమారు రూ. 1.1 కోట్లను కేంద్ర, రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధుల్లో జమ చేయాలంటూ ఆదేశాలిచ్చింది. కాగా, 2019 జనవరి 1 నుంచి సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రూ. 100 లోపు టికెట్లపై 18 శాతం నుంచి 12 శాతానికి, రూ. 100 పైబడిన టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రేక్షకులకు కాకుండా ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం టికెట్ బేస్ ధరను పెంచి తనకే మళ్లించుకుంది. పన్ను తగ్గింపుకు ముందు ఉన్న ధరలనే కొనసాగిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని ట్రైబ్యునల్ తన విచారణలో గుర్తించింది. ఈ చర్య ద్వారా నిబంధనలను ఉల్లంఘించి ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం అదనపు లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలింది.
Also Read: Yadagirigutta: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. సభ్యురాలిగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి..!
మొత్తం 6 థియేటర్లకు నోటీసులు..
అయితే, టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయని యాజమాన్యం ట్రైబ్యునల్ ముందు వాదించింది. తమ థియేటర్ నిర్వహణ ఖర్చులు పెరిగాయని, అందుకే, టికెట్ బేస్ రేట్ పెంచినట్లు తెలిపింది. అయితే, ఈ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 171 ప్రకారం పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తప్పనిసరిగా ప్రేక్షకులకు బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏఎంబీ సినిమాస్‌తో పాటు హైదరాబాద్‌లోని విశ్వనాథ్ సినిమా హాల్, జ్యోతి థియేటర్, బ్రహ్మరాంబ సినిమా వంటి మరో ఆరు థియేటర్లకు కూడా ట్రైబ్యునల్ ఇదే తరహా ఆదేశాలిచ్చింది. మొత్తం మీద ఈ థియేటర్లన్నీ కలిపి సుమారు రూ.1.7 కోట్ల మేర ప్రేక్షకుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశాయని తెలిపింది. ఆ డబ్బును వెంటనే డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

