HDB financial update : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) జూలై 2న స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయింది. మార్కెట్లో లిస్టింగ్ మొదటి రోజే అదుర్స్ అనిపించింది. అత్యధిక ఆశలు పెట్టుకున్న ఈ కంపెనీ ఇష్యూ ధర కంటే 13 శాతానికి పైగా ప్రీమియంతో లిస్టింగ్ కావడం ద్వారా మార్కెట్‌లో హైప్ క్రియేట్ చేసింది.
హెచ్‌డిబి షేరు ఎన్ఎస్ఇ (NSE), బిఎస్ఇ (BSE)లో రూ.835 వద్ద లిస్టయ్యింది. ఇది రూ.740 ఇష్యూ ధరతో పోల్చుకుంటే రూ.95 ప్రీమియంతో ప్రారంభమైంది. మిగతా షేర్లతో పోలిస్తే ఇది గ్రే మార్కెట్ అంచనాలను మించిన లిస్టింగ్ అని చెప్పాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో షేరు రూ.845.75 వరకు పెరిగి, పెట్టుబడిదారులను ఆనందపరిచింది. కంపెనీ మార్కెట్ వాల్యూషన్ రూ.70,000 కోట్లు దాటడం విశేషం.
ఈ ఐపిఒ జూన్ 25 నుండి 27 మధ్య కాలంలో ఇష్యూ చేపట్టింది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.700 నుండి రూ.740గా నిర్ణయించారు. మొత్తం ₹12,500 కోట్లు సమీకరించగా, ఇందులో రూ.2,500 కోట్లు తాజా షేర్ల ద్వారా, రూ.10,000 కోట్లు OFS ద్వారా వచ్చాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన వాటాలో భాగాన్ని విక్రయించడం ద్వారా లిస్టింగ్‌కు దోహదపడింది.
పెట్టుబడిదారుల చూపు భవిష్యత్‌పైనే..
ఈ ఐపిఒపై వచ్చిన స్పందన గణనీయంగా ఉంది. క్యూఐబిల నుంచి 58.64 రెట్లు, ఎన్ఐఐల నుంచి 10.55 రెట్లు, రిటైల్ నుంచి 1.51 రెట్లు, ఉద్యోగుల కేటగిరీ 6.03 రెట్లు, షేర్‌హోల్డర్లు 4.50 రెట్లు స్పందన ఉంది. ఈ గణాంకాలు కంపెనీ బలాన్ని, అలాగే HDFC బ్రాండ్ మీద నమ్మకాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. 2007లో స్థాపించబడిన హెచ్‌డిబి ఫైనాన్షియల్, రిటైల్ ఫైనాన్సింగ్ రంగంలో విశేష ప్రభావాన్ని చూపుతుంది. ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, కన్స్యూమర్ ఫైనాన్స్‌తోపాటు BPO సేవలు కూడా అందిస్తుంది. 1,700 పైగా బ్రాంచ్‌లు, ఫిజిటల్ (phygital) మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరణ జరిగింది. గ్రామీణ మరియు పట్టణ మార్కెట్లలో బలమైన నెట్‌వర్క్ కలిగి ఉంది.
నిపుణుల అంచనాలు
ఫైనాన్షియల్ సేవల డిమాండ్ పెరుగుతున్న క్రమంలో హెచ్‌డిబి ముందు మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎంఇ ఫైనాన్సింగ్, రిటైల్ లోన్ల విభాగాల్లో కంపెనీ శక్తివంతమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరు కొనమని సిఫార్సు చేస్తూ రూ.900 టార్గెట్ ధర సూచించాయి. ఇది లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో స్టాక్‌గా భావిస్తున్నారు. హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ ద్వారా మార్కెట్‌లో దూసుకెళ్లింది. బలమైన వ్యాపార మోడల్, గౌరవనీయమైన బ్రాండ్, బ్రోకరేజ్ మద్దతుతో ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక మంచి అవకాశంగా మారింది. అయినప్పటికీ ప్రారంభ ఉత్సాహం తర్వాత మార్కెట్ స్థిరపడే అవకాశం ఉన్నందున, వేచిచూసి నిర్ణయించడం తెలివైనదే.