Work from home: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన ఉద్యోగుల కోసం సరికొత్త హైబ్రిడ్ వర్క్ మోడల్(Hybrid Work Model) విధానాన్ని ప్రకటించింది. దేశంలో చమురు సంక్షోభాన్ని నివారించేందుకు.. ఇంధన పొదుపును పాటించాలంటూ ప్రధాని మోదీ ఇటీవల చేసిన సూచనల నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అమలు చేయాలన్న ప్రధాని పిలుపునకు స్పందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ ఈ కీలక అడుగు వేసింది.
వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్: బ్యాంక్‌లోని బిజినెస్, కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే ఎంపిక చేసిన ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు ఇంటి నుండి పనిచేసే (Work from Home) సౌకర్యాన్ని కల్పించారు. ముఖ్యంగా బ్యాంక్ అంతర్గత విభాగాలైన హెచ్ఆర్ (HR), ఫైనాన్స్, ట్రెజరీ ఆపరేషన్స్, అంతర్గత లావాదేవీలు చూసే సిబ్బందికి ఈ హైబ్రిడ్ మోడల్ వర్తిస్తుంది. ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. అయితే వచ్చే 30 రోజుల పాటు దీనిని ట్రయల్ బేసిస్ (ప్రయోగాత్మకంగా) పరిశీలిస్తామని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల రోజుల ట్రయల్ రన్ అనంతరం వచ్చే ఫలితాలు, పరిస్థితుల సమీక్ష ఆధారంగా దీనిని శాశ్వతంగా కొనసాగించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా పేర్కొంది.
Also read-kurchi thatha: కుర్చీ తాత ఆకస్మిక మరణం.. సంతాపం ప్రకటిస్తున్న నెటిజన్లు!
కస్టమర్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు: ఈ కొత్త పని విధానం వల్ల బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగవని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. నేరుగా ఖాతాదారులతో లావాదేవీలు జరిపే బ్రాంచ్ ఉద్యోగులకు ఈ మార్పులు వర్తించవని పేర్కొంది. రోజువారీ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వ పొదుపు చర్యలకు మద్దతుగా ఒక పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కార్పొరేట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

