Hinduja Group Chairman Gopichand P Hinduja Dies: ప్రపంచ ప్రఖ్యాత హిందూజా గ్రూప్ చైర్మన్, బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన గోపీచంద్ పి హిందూజా (Gopichand P Hinduja) లండన్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 85. ‘జీపీ’గా వ్యాపార వర్గాల్లో సుపరిచితులైన ఆయన, గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతూ లండన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
గత ఏడాది (2023) ఆయన పెద్ద సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తర్వాత, గోపీచంద్ గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నలుగురు హిందూజా సోదరులలో గోపీచంద్ రెండవ వారు.
సామ్రాజ్య విస్తరణ, బోఫోర్స్ మరక
1950లో కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టిన గోపీచంద్, తమ వ్యాపారాన్ని ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుండి ప్రపంచవ్యాప్త సమ్మేళనంగా (Conglomerate) మార్చడంలో ఘనత సాధించారు. ఆయన నాయకత్వంలోనే 1984లో గల్ఫ్ ఆయిల్, 1987లో అప్పట్లో నష్టాల్లో ఉన్న అశోక్ లేలాండ్‌ను కొనుగోలు చేశారు. భారత్‌లో ఎన్నారైలు పెట్టిన తొలి అతిపెద్ద పెట్టుబడి ఇదే. నేడు ఆటోమోటివ్, బ్యాంకింగ్ (ఇండస్‌ఇండ్ బ్యాంక్), ఐటీ, హెల్త్‌కేర్, మీడియా వంటి 11 రంగాల్లో హిందూజా గ్రూప్ విస్తరించింది.
అయితే, గోపీచంద్ ప్రయాణం వివాదరహితమేమీ కాదు. 1980లలో దేశ రాజకీయాలను కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణంలో గోపీచంద్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు అక్రమంగా రూ. 64 కోట్లు కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే 2005లో ఢిల్లీ హైకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ALSO READ: Artificial Intelligence : ఏఐ ప్రపంచంలో ప్రకంపనలు! ఓపెన్‌ఏఐ, అమెజాన్ మధ్య $38 బిలియన్ల భారీ డీల్!
కుటుంబ కలహాలు
2025 సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం, హిందూజా కుటుంబం 35.3 బిలియన్ పౌండ్ల (£35.3 బిలియన్) నికర విలువతో బ్రిటన్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అయితే, ఈ అపారమైన సంపద విషయంలో సోదరుల మధ్య తీవ్రమైన కుటుంబ కలహాలు నడిచాయి. 1914లో వారి తండ్రి పార్మానంద్ “అంతా అందరిది, ఏదీ ఎవరిదీ కాదు” అనే నినాదంతో వ్యాపారం ప్రారంభించినా, సోదరుల మధ్య విభేదాలు లండన్ కోర్టు వరకు వెళ్లాయి.
ALSO READ: Flying Cars: టెస్లాకు భారీ షాక్.. ఫ్లయింగ్ కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించిన చైనా కంపెనీ Xpeng!


