Urban Company blockbuster in IPO: యాప్ ఆధారిత హోమ్ సర్వీసెస్ సంస్థ అర్బన్ కంపెనీ (Urban Company) ఐపీఓలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బుధవారం స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ కంపెనీ షేర్లు 57.8 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.103తో పోలిస్తే రూ.162.25 వద్ద మొదలైంది.
లిస్టింగ్ తర్వాత మరింత లాభాలు: లిస్టింగ్ తర్వాత కూడా అర్బన్ కంపెనీ షేర్లు రాణించాయి. ఒక దశలో షేరు ధర రూ.179కి చేరుకొని ఇష్యూ ధర కంటే 73.8 శాతం అధిక లాభాన్ని ఇచ్చింది. ఇది ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
ఐపీఓకు భారీ స్పందన: రూ.1900 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చిన అర్బన్ కంపెనీకి ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 12 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉన్న ఈ ఐపీఓ చివరి రోజున 103.63 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం.. పబ్లిక్ ఇష్యూలో అందుబాటులో ఉన్న 10 కోట్ల షేర్లకు గానూ 1106 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి.
కేటగిరీల వారీగా సబ్‌స్క్రిప్షన్:
- క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB): 140.20 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
- నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII): 74.04 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది.
- రిటైల్ ఇన్వెస్టర్స్: 39.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
సమీకరించిన నిధుల వినియోగం: ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను టెక్నాలజీ అభివృద్ధి, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కార్యాలయాల లీజు చెల్లింపులు, మార్కెటింగ్ కార్యకలాపాలు, మరియు ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, గోల్డ్‌మ్యాన్ శాక్స్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరించాయి.
ఐపీఓ అనగా : ఐపీఓ (IPO) అంటే “ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్” అని అర్థం. ఒక ప్రైవేట్ కంపెనీ మొదటిసారిగా తన షేర్లను సాధారణ ప్రజలతోపాటుగా సంస్థలకు అమ్మకానికి పెట్టడాన్ని ఐపీఓ అంటారు. కొత్త ప్రాజెక్టుల కోసం, అప్పులు తీర్చడానికి, లేదా కంపెనీని విస్తరించడానికి డబ్బు అవసరమైనప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఐపీఓకి వెళ్తాయి. పబ్లిక్‌గా మారడం వల్ల కంపెనీకి మంచి గుర్తింపు మరియు విశ్వసనీయత లభిస్తుంది.


