Learning License Vs Driving License: ఇంటర్నెట్ సదుపాయాలు పెరగడంతో ఎంతో మంది రోజువారీ అవసరాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా ఇక ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం, పరీక్షలకు హాజరవడం, ప్రాసెస్‌ను ట్రాక్ చేయడం సాధ్యమైంది. అయితే దీనికి ముందు కొన్ని విషయాలను మీరు గమనించాలి.
లెర్నింగ్ లైసెన్స్ తప్పనిసరి..
మొదటిగా, డ్రైవింగ్ లైసెన్స్‌కు ముందు లెర్నింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఇది తాత్కాలిక లైసెన్స్‌గా పనిచేస్తుంది. వాహనం నడవడం మొదలుపెట్టే వారికి ఈ లైసెన్స్ ఇవ్వబడుతుంది. దీన్ని పొందిన తర్వాత మీరు స్వయంగా లేదా డ్రైవింగ్ స్కూల్ సహాయంతో నేర్చుకోవచ్చు. ఈ దశలో డ్రైవింగ్ టెస్ట్ అవసరం ఉండదు. అంతేగాక, పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
లెర్నింగ్ లైసెన్స్ దరఖాస్తు చేయాలంటే ముందుగా రాష్ట్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా పారీవాహన సర్వీసుల పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ “లెర్నింగ్ లైసెన్స్” అనే విభాగాన్ని ఎంచుకుని, మీ రాష్ట్రం, RTO కార్యాలయం వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత Aadhaar ఆధారిత eKYC ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
ఆన్‌లైన్ టెస్ట్…
ఈ దశ తర్వాత, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ పై ఉండే ఆన్‌లైన్ టెస్ట్‌కు టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ పరీక్షలో సాధారణంగా 10-15 ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్ ఛాయిస్ ఫార్మాట్‌లో ఉంటాయి. కనీస అంకాలతో ఈ పరీక్షను ఉత్తీర్ణత సాధిస్తే, లెర్నింగ్ లైసెన్స్ జారీ అవుతుంది.
‘L’ గుర్తు …
లెర్నింగ్ లైసెన్స్ మంజూరైన తర్వాత 30 రోజుల తర్వాత మాత్రమే మీరు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు తగినంత డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకుని ఉండాలి. అయితే, లెర్నింగ్ స్టేజీలో వాహనం నడుపుతున్నప్పుడు ‘L’ గుర్తు వాహనంపై స్పష్టంగా కనిపించేలా ఉంచాలి. ఇది చట్టపరమైన అవసరం.
పర్మినెంట్ లైసెన్స్ దరఖాస్తు చేసుకునే సమయంలో RTO కార్యాలయానికి స్వయంగా వెళ్లాలి. అక్కడ అధికారులు నేరుగా మీ డ్రైవింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ముందుగా ఆన్లైన్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. టెస్ట్‌లో, మీరు వాహనం ఎలా నడుపుతారో, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటిస్తున్నారో, రివర్స్ డ్రైవింగ్ చేయగలరా వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తారు.
పరీక్షలో విజయవంతమైతే, కొన్ని రోజుల్లో మీ ఫైనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు పోస్టు ద్వారా ఇంటికే వస్తుంది. మీరు దీన్ని DigiLocker లాంటి ప్లాట్‌ఫామ్లలో డిజిటల్‌గా స్టోర్ చేసుకోవచ్చు.కొన్ని రాష్ట్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పరీక్షను నిర్వహించనున్నారు. ఇది అభ్యర్థి స్వయంగా పరీక్షకు హాజరయ్యాడా లేదా అన్నదాన్ని నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.
వివిధ రకాల వాహనాల కోసం లైసెన్స్ తీసుకునే ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ఉదాహరణకు, ద్విచక్ర వాహనాలకు వేరే టెస్ట్ ఉండగా, LMV (లైట్ మోటార్ వెహికల్స్) కోసం వేరే విధంగా పరీక్ష ఉంటుంది. రెండు వర్గాలకు కూడ ప్రత్యేక అప్లికేషన్ ఫీజు ఉంటుంది.పూర్తి ప్రక్రియను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి మీరు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. అప్‌డేట్లు ఎస్‌ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా వస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించిన సమాచారం మొత్తం డిజిటల్‌గా సేవ్ అవుతుంది, ఇది భవిష్యత్తులో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తేలికగా వస్తుంది.
Also Read: https://teluguprabha.net/business/jio-pc-turns-tv-into-personal-computer-with-rs-599-plan/


