HP: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు (Layoff) భయం కొనసాగుతూనే ఉంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాల బాటలోనే, ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ (HP) కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. రాబోయే రెండు నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల (2027-28 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు) కాలంలో ప్రపంచవ్యాప్తంగా 4,000 నుంచి 6,000 మంది ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ నిర్ణయించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కంపెనీ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌పీ స్పష్టం చేసింది.
Layoffs : యాపిల్‌లోనూ లేఆఫ్‌ల పరంపర
లేఆఫ్‌లకు అసలు కారణాలు ఇవే
హెచ్‌పీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధానంగా రెండు కీలక అంశాలను వెల్లడించింది. కంపెనీ తమ ఉత్పాదకతను పెంచడానికి మరియు అంతర్గత కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించాలని యోచిస్తోంది. దీని వలన ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగుల అవసరం తగ్గుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రకటించడం వలన కంపెనీకి తయారీ ఖర్చులు పెరిగాయి. అదే సమయంలో, కస్టమర్లు AI ఫీచర్లు ఉన్న కొత్త కంప్యూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో మెమొరీ చిప్‌ల ఖర్చులు కూడా పెరిగాయి.ఈ పెరుగుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకోవడానికి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వ్యయ కోత చర్యలు చేపట్టాలని హెచ్‌పీ భావిస్తోంది.
ఆదా అయ్యేది $1 బిలియన్
హెచ్‌పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్రిక్ లోర్స్ మాట్లాడుతూ, ఈ లేఆఫ్‌ల వలన ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, అంతర్గత కార్యకలాపాలు మరియు కస్టమర్ సపోర్ట్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం అవుతారని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సంస్థకు దాదాపు $1 బిలియన్ డాలర్ల (సుమారు ₹8,925 కోట్ల) వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. ఈ ఆదా అయిన మొత్తాన్ని మార్కెట్లో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , భవిష్యత్తు ఆవిష్కరణలకు వినియోగిస్తామని ఆయన వివరించారు.
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కూడా హెచ్‌పీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే 1,000 నుంచి 2,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. టెక్ రంగంలో AI యొక్క విస్తరణ మరియు మారుతున్న ఆర్థిక పరిస్థితులు ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

