Huawei Battery 5 minute charge : టెక్ ప్రపంచంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో హువావే (Huawei) విప్లవం సృష్టించబోతోంది. ఇటీవల ఈ కంపెనీ దాఖలు చేసిన ఒక పేటెంట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా కంపెనీ ఒక అద్భుతమైన బ్యాటరీ పేటెంట్‌ను ఫైలింగ్ చేయగా, అది కేవలం 5 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, ఒక్కసారి చార్జ్ చేస్తే 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ సమాచారం బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహన రంగానికే కాకుండా మొత్తం టెక్ పరిశ్రమకు గట్టి షాక్ ఇచ్చే వార్తగా మారింది. ఈ అంకెలు వినడానికి కల్పనలా అనిపించినా, ఇది నిజమైతే ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక కొత్త బ్యాటరీ కాదు, ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.
ఇవిలో రెండు భయాలు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారిలో ప్రధానంగా రెండు భయాలు ఉన్నాయి. “రేంజ్ యాంగ్జైటీ” (ఛార్జ్ అయిపోతుందేమోనన్న ఆందోళన), మరొకట్ ఛార్జింగ్ కోసం పట్టే సుదీర్ఘ సమయం గురించి ఆందోళన ఉంది. సుదూర ప్రయాణాలకు వెళ్లాలంటే ఎన్ని ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. ఎంతసేపు ఆగాలి అనే లెక్కలు వేసుకోవాలి. కానీ, హువావే పేటెంట్ చేసిన సల్ఫైడ్ ఆధారిత సాలిడ్-స్టేట్ బ్యాటరీ ఈ సమస్యలన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టగలదు.
ఈ బ్యాటరీ ప్రత్యేకత?
హువావే ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ సాధారణ లిథియం ఐయాన్ బ్యాటరీలకంటే చాలా ముందున్నది. ఇది అధిక ఎనర్జీ డెన్సిటీతో ఉండటంతోపాటు, వేగంగా ఎలక్ట్రాన్లను చార్జ్ చేయగలిగే రీతిలో రూపొందించబడింది. ముఖ్యంగా ఈ బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. EVలలో 3,000 కిమీ వరకూ ప్రయాణించగలదు. ఉష్ణోగ్రత, ఒత్తిడిపై అధిక నియంత్రణతో సేఫ్టీ హామీ ఇస్తుంది. దీర్ఘకాలిక జీవితం కలిగిన కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారైంది.
ఎలక్ట్రిక్ వాహన రంగానికి పెద్ద ప్లస్
ఇంతవరకూ EVలలో ప్రధానమైన అడ్డంకి ‘చార్జింగ్ సమయం’ మరియు ‘రేంజ్ ఎన్జైటీ’ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్కువ బ్యాటరీలు ఫుల్ చార్జ్ అవ్వడానికి కనీసం 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. అలాగే రేంజ్ కూడా సగటున 400–600 కిమీ వరకు మాత్రమే ఉంటుంది. హువావే ఈ రెండు సమస్యలకు సమాధానం అందిస్తూ, EV రంగాన్ని పూర్తిగా మార్చివేయగల సామర్థ్యాన్ని చూపించింది. ఒక్కసారి చార్జ్ చేస్తే బెంగుళూరు నుండి ముంబై వరకు ప్రయాణించగలిగితే, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల నమ్మకం అమాంతం పెరుగుతుంది.
పేటెంట్ వివరాలు
కంపెనీ ఈ కొత్త పేటెంట్‌ను చైనా ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీ బ్యూరోలో ఫైలింగ్ చేశారు. పేటెంట్ ప్రకారం ఇది అధునాతన థర్మల్ మేనేజ్మెంట్, నానో-కంపోజిట్ మటీరియల్స్, మరియు ఇంటెలిజెంట్ ఛార్జింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించబడిన టెక్నాలజీ. ఇది కేవలం EVలకే కాకుండా స్మార్ట్‌ఫోన్లు, డ్రోన్లు, ల్యాప్‌టాప్లు, హై-ఎండ్ వేర్‌బుల్ డివైసెస్, వంటివన్నిటిలోనూ విస్తృతంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
టెక్ కంపెనీల రేస్‌లో గట్టిపోటీ
Huawei ఈ నూతన ఆవిష్కరణతో Tesla, CATL, Panasonic, BYD వంటి దిగ్గజ బ్యాటరీ తయారీదారుల మధ్య పోటీని మరింత పెంచింది. ఇప్పటికే Tesla మరియు CATL కంపెనీలు తమ సొంతంగా 1,000–2,000 కిమీ రేంజ్ బ్యాటరీలపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ 3,000 కిమీ మరియు 5 నిమిషాల చార్జింగ్ లక్ష్యాన్ని తాకడం అనేది వాస్తవంగా గొప్ప ఘనత అనే చెప్పాలి.
మార్కెట్లోకి ఎప్పటికి వస్తుంది?
ఇది ప్రస్తుతానికి పేటెంట్ దశలో ఉంది. అయితే హువావేకి ఉన్న పరిశోధన సామర్థ్యం, భారీ పెట్టుబడులు మరియు గ్లోబల్ ఉనికి ద్వారా ఇది రాబోయే 2–3 సంవత్సరాల్లో కమర్షియల్ వినియోగానికి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కంపెనీ కొన్ని పరిశీలనల దశలలో ఉన్నట్లు సమాచారం.