Real Estate : హైదరాబాద్ మహా నగరం దినదినాభివృద్ధి చెందుతూ విశ్వ నగరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా జరిగిన భూ వేలంలో మైండ్‌బ్లోయింగ్ ధర పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ (TGIIC) వేలం వేయగా, ఎకరం ఏకంగా రూ. 177 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. గతంలో కోకాపేటలో నమోదైన రికార్డు (ఎకరం రూ. 100 కోట్లు)ను ఈ ధర అధిగమించింది.
ఈ రికార్డు బ్రేకింగ్ వేలంలో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ విజేతగా నిలిచింది. ఈ సంస్థ మొత్తం 7.67 ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ. 177 కోట్ల చొప్పున సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం డీల్ విలువ రూ. 1,357 కోట్లు కావడం విశేషం. మిగిలిన 11 ఎకరాల స్థలం వేలం కూడా కొనసాగుతున్నట్టు సమాచారం.
ఒకవైపు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, మరోవైపు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లోనూ రికార్డులు నమోదవుతున్నాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో జరిగిన విక్రయంలో చదరపు గజం ఏకంగా రూ. 1.14 లక్షలు పలికింది.
హైదరాబాద్‌లో భూమికి ఉన్న డిమాండ్‌కు ఈ తాజా వేలాలే నిదర్శనం. ప్రభుత్వం ప్రకటించిన వేలం ప్రక్రియ అక్టోబర్ 6వ తేదీన ముగియగా, ఈ రికార్డు ధరలు హైదరాబాద్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనడానికి సంకేతం. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో వేలం జరగనున్న నేపథ్యంలో, రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత జోష్‌గా మారే అవకాశం ఉంది.


