Tuesday, December 9, 2025
HomeTop StoriesLPG Imports from US: మెున్న క్రూడ్ ఆయిల్.. ఇవాళ గ్యాస్: అమెరికా నుంచి పెరుగుతున్న...

LPG Imports from US: మెున్న క్రూడ్ ఆయిల్.. ఇవాళ గ్యాస్: అమెరికా నుంచి పెరుగుతున్న దిగుమతులు

US LPG Imports Deal: భారత్ తన వంట గ్యాస్ అదే ఎల్పీజీ దిగుమతులను విస్తరించే దిశగా మరో కీలక అడుగు వేసింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ దీనికి సంబంధించిన ప్రకటన ఎక్స్ ద్వారా చేశారు. భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు అమెరికా గల్ఫ్ తీర ప్రాంతం నుంచి ఎల్పీజీ దిగుమతికి ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

- Advertisement -

2026 ఒప్పంద సంవత్సరానికి 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని అమెరికా నుంచి దిగుమతి కానుంది. ఇది భారత్ ఏడాదికి దిగుమతి చేసుకునే మొత్తం ఎల్పీజీ పరిమాణంలో దాదాపు 10 శాతం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో ఈ ఒప్పందం భారత ఎనర్జీ భద్రతను బలపరుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒప్పందం మాంట్ బెల్వ్యూ సూచిక ఆధారంగా ధరల నిర్ణయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే దేశీయ చమురు కంపెనీ ప్రతినిధిలు యూఎస్ సందర్శించినట్లు చెప్పారు. పైగా ఇదొక చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు పూరీ.

భారత ప్రజలకు సురక్షితమైన, అందుబాటులో ఉండే ఎల్పీజీ సరఫరా చేయాలన్న లక్ష్యంతో తాము సరఫరా వనరులను విస్తరించుకుంటున్నట్లు పూరీ అన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా ఉంది. ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా గ్రామీణ కుటుంబాలకు చౌకగా వంటగ్యాస్ అందించడం వలన దేశ వ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ తన అవసరాల్లో 50 శాతం కంటే ఎక్కువను పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

అమెరికా నుండి భారీగా ఎల్పీజీ కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఒకే భౌగోళిక ప్రాంతంపై ఆధారపడకుండా సరఫరా వ్యవస్థను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులను రక్షించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని భరించిందని పూరీ అన్నారు. మెుత్తానికి అమెరికా రష్యా చమురు దిగుమతుల టారిఫ్స్ తర్వాత వెనక్కు తగ్గిన ఇండియా అమెరికాతో కూడా వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా పెంచుకుంటోంది. గత నెలలో చమురు దిగుమతులు అమెరికా నుంచి పెరగగా.. తాజాగా ఎప్పీజీ దిగుమతుల ఒప్పందం జరిగింది. యూఎస్ లాబీయింగ్ ఫలించిందని రానున్న కాలంలో టారిఫ్స్ తగ్గే అవకాశాలు కూడా అమెరికా నుంచి ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News