Homeబిజినెస్GDP : అనిశ్చితుల్లోనూ భారత జీడీపీ జోరు.. తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధి నమోదు

GDP : అనిశ్చితుల్లోనూ భారత జీడీపీ జోరు.. తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధి నమోదు

న్యూఢిల్లీ ( తెలుగు ప్రభ ) : ఇరాన్‌ యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ సత్తా చాటింది. 2026–27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. ఇది ఆర్‌బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే అధికం కావడం విశేషం. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) సోమవారం ఈ వివరాలను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన 6.9 శాతంతో పోలిస్తే వృద్ధి మరింత పుంజుకుంది. అంతకుముందు జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన 8.6 శాతంతో పోలిస్తే తొలి త్రైమాసిక వృద్ధి కొంత తగ్గింది. అయినప్పటికీ ఇరాన్‌ యుద్ధంతో ఇంధన మార్కెట్లలో ఏర్పడిన ఒడిదుడుకులు, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ వృద్ధి అంచనాలకు మించి నమోదైంది. బాహ్య ప్రతికూలతలు, అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రపంచ డిమాండ్‌ మందగించే అవకాశాలున్నా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది.

- Advertisement -

పూర్తి ఏడాదికి 6.7% అంచనా : తొలి త్రైమాసికంలో స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ రూ.81.36 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.75.46 లక్షల కోట్లు. ప్రస్తుత ధరల వద్ద నామమాత్ర జీడీపీ రూ.88.27 లక్షల కోట్లకు చేరగా, 10.3 శాతం వృద్ధి నమోదైంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ మొత్తం జీడీపీ వృద్ధిని 6.7 శాతంగా అంచనా వేసింది.

భారత్‌ మరోసారి వికసించింది: ప్రధాని మోడీ  : 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేసిన విమర్శకుల అంచనాలు తారుమారయ్యాయని వ్యాఖ్యానించారు. ‘భారత్‌ మరోసారి వికసించింది’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం వృద్ధి అసాధారణ విజయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, చమురు ధరల షాక్‌లు, సరఫరా వ్యవస్థలో సమస్యలు ఎదురైనప్పటికీ ప్రజల సమష్టి శక్తితో భారత్‌ ఈ వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. గత త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే తాజా వృద్ధి కొంత తగ్గింది. అయినప్పటికీ మార్కెట్‌ అంచనాలను మించి వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. ఇరాన్‌లో యుద్ధం, దాని ప్రభావంతో ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థైర్యాన్ని తాజా గణాంకాలు చాటుతున్నాయని పేర్కొన్నారు.

సంస్కరణల ఫలితమే 7.8% వృద్ధి: నిర్మలా సీతారామన్  : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహించడం వల్లే ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ వృద్ధి ఆర్‌బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే అధికమని పేర్కొన్నారు. ఈ బలమైన వృద్ధికి దేశ ప్రజల కృషే ప్రధాన కారణమని సీతారామన్‌ తెలిపారు. ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామమాత్ర జీడీపీ 10.3 శాతం, వాస్తవ స్థూల విలువ జోడింపు (జీవీఏ) 8.2 శాతం వృద్ధి చెందింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News