India US Deal: అనేక నెలలుగా ఇండియా అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ ట్రంప్ ఇండియాపై టారిఫ్స్ ఏకంగా 50 శాతానికి పెంచినప్పటి నుంచి రెండు దేశాలు వీలైనంత త్వరగా ట్రేడ్ డీల్ చేసుకునేందుకు అనేక దఫాలుగా చర్చలు కొనసాగిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ట్రేడ్ డీల్ కుదిరితే ఇది అభివృద్ధికి అండగా నిలవటంతో పాటు ఎనర్జీ, జియోపొలిటికల్ వంటి అంశాల్లో కూడా కీలక ముందడుగుగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య టారిఫ్స్ వార్ ముగిస్తే.. చర్చలు సఫలీకృతంగా మారితే ఇండియాపై యూఎస్ విధిస్తున్న సుంకాల ప్రభావం ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 15-16 శాతానికి మధ్యకు తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సానుకూల వార్తలతో భారత స్టాక్ మార్కెట్లు ఉపశమనం పొందుతున్నాయి. చర్చల్లో భాగంగానే భారత్ క్రమంగా తన రష్యా చమురు దిగుమతులను డైవర్సిఫై చేయటానికి అంగీకరించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ గతవారమే ట్రంప్ ఈ విషయంలో మోడీ తనకు రష్యా చమురు దిగుమతులను తగ్గించటానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చినట్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం భారత్ తన క్రూడ్ అవసరాల్లో 34 శాతం రష్యా నుంచే దిగుమతులుగా పొందుతోంది. అయితే 10 శాతం ఆయిల్ అండ్ గ్యాస్ అవసరాలను అమెరికా నుంచి దిగుమతులు చేసుకుంటోంది. ట్రంప్ లాబీయింగ్ ద్వారా అమెరికానుంచి రానున్న కాలంలో దిగుమతులు పెంచేందుకు భారత్ పై ఒత్తిళ్లు జరుగుతున్నట్లు మరికొందరు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల గురించి ఆసియాన్ సమ్మిట్ సమయంలో బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే దేశంలో పెరుగుతున్న డిమాండ్ అవసరాల కోసం అమెరికా నుంచి మెుక్క జొన్న దిగుమతులను పెంచేందుకు ఇండియా అంగీకరించొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది పౌల్ట్రీ, డెయిరీ, ఇథనాల్ రంగాల్లో అవసరాలను తీర్చగలదని వారు అంటున్నారు. మెుత్తానికి ట్రంప్ నయాన లేదా భయాన ఇండియాను తమ నుంచి క్రూడ్ ఆయిల్, ఇథనాల్, డెయిరీ, అగ్రి ఉత్పత్తులు కొనేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే భారత్ దీనికి ఎంత మేర అంగీకరిస్తుంది, ఎలాంటి నిబంధనలు పెడుతుందో వేచి చూడాల్సిందే. చాలా కాలంగా నిపుణులు చెబుతున్నట్లుగా ట్రంప్ బాధ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కాదని.. అమెరికాతో వ్యాపారాన్ని పెంచటం అని చెప్పిన విషయాలు ప్రస్తుతం వాస్తవంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.


