Russian Air Defence Systems: ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా తయారీ ఎస్‑400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుత పనితీరు కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం మరిన్ని ఎస్‑400 వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచే దిశగా కీలకంగా ఈ ఆర్డర్ భావించబడుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్‌లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కొత్త ఎస్‑400 వ్యవస్థల కొనుగోలు అంశంపై చర్చలు జరుగనున్నాయని సమాచారం.
భారత్ 2018లో రష్యాతో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఐదు ఎస్‑400 వ్యవస్థలను రష్యా నుండి కొనుగోలు చేయాల్సి ఉంది. అమెరికా CAATSA ఆంక్షల హెచ్చరికలు ఉన్నప్పటికీ.. భారత్ తన రక్షణ అవసరాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఒప్పందాన్ని కొనసాగించింది. మెుత్తం ఐదింటిలో రెండు 2026 చివరి నాటికి భారత వైమానిక దళానికి అందేలా ప్రణాళిక ఉంది. మిగిలిన మూడు ఎప్పుడు డెలివరీ అవుతాయనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.
భారత రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ వారం రష్యా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కొత్తగా మరో ఐదు ఎస్‑400 వ్యవస్థలను ఆర్డర్ చేసే దిశాగా వారి మధ్య చర్చలు జరుగుతున్నట్లు వెల్లడైంది. మూడింటిని నేరుగా కొంటుండగా.. మిగిలిన మిగిలిన రెండు వ్యవస్థలను భారత ప్రైవేట్ రంగంలో తయారు చేయడానికి ట్రాన్స్‌ఫర్-ఆఫ్-టెక్నాలజీ మోడల్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒప్పందం ద్వారా నిర్వహణ, మరమ్మతుల సదుపాయాలను దేశీయంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది.
ఆపరేషన్ సిందూర్‌లో ఎస్‑400 వ్యవస్థ అత్యుత్తమ పనితీరు చూపి, భారత రక్షణ వ్యవస్థలో తన ప్రాముఖ్యతను నిరూపించింది. 400 కిలోమీటర్ల దూరం లోపల శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే సామర్థ్యంతో ఇది అత్యాధునిక రక్షణ కవచంగా నిలిచింది. ఈ సామర్థ్యం భారత్‌కి సముద్రతీరాల నుంచి ఉత్తర సరిహద్దుల వరకు సమగ్ర రక్షణ వలయాన్ని ఏర్పరచడంలో సహాయం చేస్తుందనే అభిప్రాయం నిపుణులది. అయితే భారత్ ప్రస్తుతానికి రష్యాకు చెందిన ఎస్‑500 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కొనాలని అనుకోవటం లేదని.. అది ఇప్పటికీ రష్యాలో అభివృద్ధి దశలోనే ఉందని అధికారులు చెబుతున్నారు.


