Homeబిజినెస్Indian Origin Techies: భారత తేజాల ప్రభంజనం.. జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టిన యువ కుబేరులు!

Indian Origin Techies: భారత తేజాల ప్రభంజనం.. జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టిన యువ కుబేరులు!

Youngest self-made billionaires : అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి యువత మేధో పతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది. ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే సిలికాన్ వ్యాలీలో మన కుర్రాళ్లు సరికొత్త చరిత్రను లిఖించారు. కేవలం 22 ఏళ్లకే స్వయంకృషితో బిలియనీర్లుగా అవతరించి, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టారు. వారే ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా. కళాశాల విద్యను సైతం పక్కనపెట్టి, కేవలం ఒక హాస్టల్ గదిలో మొదలైన వారి ప్రస్థానం, వేల కోట్ల సామ్రాజ్యంగా ఎలా ఎదిగింది? వారి విజయ రహస్యం ఏమిటి? ఈ ఆసక్తికర కథనంలోకి వెళ్దాం.

- Advertisement -

హాస్టల్ గది నుంచి వేల కోట్ల కంపెనీ వరకు : ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా తమ క్లాస్‌మేట్ బ్రెండన్ ఫుడీతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ (Mercor) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రిక్రూటింగ్ స్టార్టప్ అనూహ్య విజయం సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఇటీవలే ఏకంగా రూ.3,100 కోట్ల నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.88 వేల కోట్లకు చేరింది. ఈ అద్భుతమైన ఆర్థిక పురోగతితో, కంపెనీ వ్యవస్థాపకులైన ఈ ముగ్గురూ అత్యంత పిన్న వయసులోనే ‘సెల్ఫ్-మేడ్ బిలియనీర్లు’గా అవతరించారని ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించింది.

ఇంతకాలం ఈ రికార్డు ఫేస్‌బుక్ (మెటా) వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ పేరిట ఉండేది. ఆయన 2008లో, తన 23వ ఏట బిలియనీర్ క్లబ్‌లో చేరారు. అయితే, ఆదర్శ్, సూర్య 22 ఏళ్లకే ఈ ఘనత సాధించి జుకర్‌బర్గ్ రికార్డును తిరగ రాశారు. ప్రస్తుతం మెర్కోర్ కంపెనీకి బ్రెండన్ ఫుడీ సీఈఓగా, ఆదర్శ్ హిరేమత్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా, సూర్య మిధా బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

విజయానికి పునాది వేసిన స్నేహం, చదువుకు స్వస్తి : న్యూదిల్లీ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబంలో సూర్య మిధా జన్మించారు. ఆదర్శ్, సూర్య ఇద్దరూ కాలిఫోర్నియాలోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ పాఠశాలలో సహాధ్యాయులు. పాఠశాల డిబేట్ టీమ్‌లో వీరిద్దరి స్నేహం బలపడింది. చదువులో చురుగ్గా ఉంటూనే, వ్యాపార ఆలోచనలతో ముందుకు సాగారు.
ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆదర్శ్, ‘మెర్కోర్’ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి కోర్సు పూర్తికావడానికి రెండు నెలల ముందే చదువుకు స్వస్తి పలికారు. అదేవిధంగా, జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో చదువుతున్న సూర్య మిధా, బ్రెండన్ ఫుడీ కూడా తమ చదువును మధ్యలోనే ఆపేశారు. ఆదర్శ్ హిరేమత్‌కు చెందిన హాస్టల్ గది నుంచే ‘మెర్కోర్’ కార్యకలాపాలను ప్రారంభించడం వీరి ప్రస్థానంలో ఒక మైలురాయి. ఈ ముగ్గురికీ ప్రముఖ టెక్ దిగ్గజం పీటర్ థీల్ ఏర్పాటు చేసిన ‘థీల్ ఫెలోషిప్’ లభించడం వారి ప్రతిభకు నిదర్శనం.

యువ కుబేరుల జాబితాలో అగ్రస్థానం : అమెరికన్ టెక్ కంపెనీల వ్యవస్థాపకుల్లో వ్యక్తిగత సంపద రూ.8 వేల కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) దాటిన వారి జాబితాలో కూడా ఈ యువ త్రయం అగ్రస్థానాల్లో నిలిచింది. ‘పాలీమార్కెట్’ సీఈఓ షేన్ కోప్లాన్ (27) మొదటి స్థానంలో ఉండగా, బ్రెండన్, ఆదర్శ్, సూర్య తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మహిళా విభాగంలో ‘స్కేల్ ఏఐ’ సహ వ్యవస్థాపకురాలు లూసీ గువో (30) అతి పిన్న వయస్కురాలైన సెల్ఫ్-మేడ్ మహిళా బిలియనీర్‌గా రికార్డు సృష్టించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News