Train Luggage Rules: రైలులో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ కీలక సూచనలు జారీ చేసింది. ఇకపై రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో లగేజీపై కఠిన నిబంధనలు అమలు కానున్నాయని తెలుస్తోంది. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే బ్యాగుల బరువు, పరిమాణంపై కొత్త నియమాలు తీసుకువచ్చింది. దీనివల్ల రద్దీని తగ్గించి, రైళ్లలో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చాలని రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్రాజ్, మీర్జాపూర్, కాన్పూర్, అలీఘర్ జంక్షన్ వంటి ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేయనున్నారు.
రైల్వే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ లగేజీని ఎలక్ట్రానిక్ బరువు యంత్రాల ద్వారా తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి తరగతి ప్రయాణికులకు నిర్దేశించిన బరువు పరిమితులను మించితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని వెల్లడైంది.
ఏ తరగతికి ఎంత లగేజీ అనుమతిస్తారు?
* ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితం.
* ఏసీ 2-టైర్ స్లీపర్/ఫస్ట్ క్లాస్: 50 కిలోల వరకు ఉచితం.
* ఏసీ 3-టైర్ స్లీపర్/ఏసీ చైర్ కార్: 40 కిలోల వరకు ఉచితం.
* స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితం.
* సెకండ్ క్లాస్: 35 కిలోల వరకు ఉచితం.
* అలాగే 5-12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు గరిష్టంగా 50 కిలోల వరకు సగం లగేజీ ఫ్రీ అలవెన్స్ ఉంటుంది.
ప్రయాణికులకు వారు జర్నీ చేస్తున్న క్లాస్ ఆధారంగా లగేజీ ఉచితంగా అనుమతించిన బరువును మించితే.. అదనపు బరువుపై ఛార్జీలు వర్తిస్తాయి. నిర్దేశిత ఉచిత బరువును మించి లగేజీ తీసుకెళ్తే మిగిలిన బరువుకు 1.5 రెట్లు ‘L’ స్కేల్ చార్జీలు వర్తిస్తాయి. కనీసం 50 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జీ రూ.30 గా ఉంటుంది. అలాగే కనీస ఛార్జిబుల్ బరువును 10 కిలోలుగా నిర్ణయించారు. అలాగే లగేజీ వాస్తవ బరువు తక్కువగా ఉన్నప్పటికీ దాని పరిమాణం పెద్దగా ఉంటే కొలతల ఆధారంగా బరువును లెక్కిస్తారు. దీనికోసం ఒక ఫార్ములాను కూడా రైల్వేస్ వెల్లడించింది. మీరు తీసుకెళ్లే లగేజీ బరువు ఉచిత పరిమితిని కొద్దిగా మించితే సాధారణ ఛార్జీలు మాత్రమే ఉంటాయి.. అయితే అవి రూల్స్ ప్రకారం మార్జినల్ అలవెన్స్ పరిమితిని కూడా మించితే అప్పుడు భారీగా జరిమానాలు ఉంటాయని తెలుస్తోంది.


