Rupee Gains Over Dollar: బుధవారం రోజున ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తిరిగి పుంజుకుంటోంది. ఈ క్రమంలో రూపాయి మారకపు విలువ అమెరికా డాలర్ పై 28 పైసలు బలపడింది. దీని వెనుక ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించనున్నదన్న అంచనాలే. ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలహీనపడుతోంది. ఫలితంగా రూపాయికి మద్దతు లభిస్తోంది. మరో పక్క అమెరికాలో ఆర్థిక మాద్యంపై ఆందోళనలు, విదేశాలు ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు తగ్గించటం వంటి అంశాలు కూడా డాలర్ పతనానికి కారణాలుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఫెడరల్ రిజర్వ్ ఈ వారం 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గించనున్నదన్న అంచనాలపై పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. అమెరికా-భారత్ ట్రేడ్ టాక్ లపై విశ్వాసం, దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెంచడం కూడా రూపాయిని బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫెడ్ వడ్డీ రేటు తగ్గిస్తే.. పెట్టుబడుల లోటు ఏర్పడుతుంది. ఫలితంగా అమెరికా డాలర్‌లో అమ్మకాలు మరింతగా పెరిగి విలువ పతనం కొనసాగుతుంది. దీనికి తోడు అమెరికాలో జాబ్ డేటా బలహీనంగా ఉండటంతో మార్కెట్లు ఫెడ్ రేట్ల కట్ కోసమని నిరీక్షణలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుసగా అధికంగా ఫెడ్ నుంచి వడ్డీ రేటు తగ్గింపును డిమాండ్ చేయడం కూడా డాలర్‌పై ఒత్తిడిని కలిగిస్తోంది. దీంతో ఇవాళ ఇంట్రాడేలో రూపాయి విలువ డాలరుతో పోల్చితే 28 పైసలు లాభపడి 87.81కి చేరుకుంది. దీనికి తోడు భారతదేశంతో అమెరికా ట్రేడ్ టాక్‌లు, స్థానిక మార్కెట్ ఫ్యాక్టర్లు రూపాయికి మద్దతు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మెుత్తానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులు తగ్గిస్తే డాలర్ బలహీనపడటం సహజమే. ఇదే సమయంలో స్థానికంగా ఇన్వెస్టర్ విశ్వాసం, మంచి ఫారెక్స్ ప్రవాహాలు, మార్కెట్ అంచనాలు రూపాయిని బలోపేతం చేస్తున్నాయి.


