Indian startups in WEF 2025: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్)లో భారతీయ స్టార్టప్ (అంకుర సంస్థలు) సత్తా చాటాయి. తాజాగా డబ్ల్యుఇఎఫ్ తన 2025 టెక్నాలజీ పయనీర్స్ జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రతిష్ఠాత్మక లిస్ట్‌లో భారత్‌కు చెందిన ఏకంగా 11 స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీల జాబితాలో భారత్‌కు అత్యధిక స్థానం లభింభించింది. ఇది భారత్ టెక్ రంగం, ఆవిష్కరణ సామర్థ్యాన్ని గ్లోబల్ వేదికపై చూపింది. ఈ జాబితాలో స్థానం పొందే స్టార్టప్‌లు సాధారణమైనవేమీ కావు. వీటిని విప్లవాత్మక ఆవిష్కరణలు, సామాజిక ప్రభావం, దీర్ఘకాలిక విజన్ వంటి ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు. గతంలో గూగుల్, పేపాల్, స్పోటిఫై, డ్రాప్‌బాక్స్ వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అలాంటి ఘనతను ఇప్పుడు భారతదేశానికి చెందిన యువ కంపెనీలు పొందడం గర్వకారణం.
అంతరిక్ష రంగంలో భారత్ సత్తా
ఈ ఏడాది జాబితాలో భారత్ నుంచి మూడు స్టార్టప్‌లు అంతరిక్ష సాంకేతికత రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అగ్నికుల్ కాస్మోస్ (Agnikul Cosmos), ఈ స్టార్టప్ తక్కువ ఖర్చుతో మొబైల్ మరియు మోడ్యులర్ రాకెట్ లాంచ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇటీవలి కాలంలో, చెన్నై IITలో ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్‌ను స్థాపించిన మొదటి సంస్థగా నిలిచింది. మరొకటి దిగంతర (Digantara), ఈ సంస్థ అంతరిక్షంపై దృష్టిపెట్టింది. స్పేస్ లో శిథిలాలు, ఉపగ్రహాల కదలికలను ట్రాక్ చేసేందుకు గాను స్పేస్ సిట్యుయేషన్ అవేర్నెస్ (SSA) ప్లాట్‌ఫారాన్ని అభివృద్ధి చేస్తోంది. గెలాక్స్‌ఐ (GalaxEye), ఇది మల్టీ-సెన్సర్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ పరిశీలనలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఇది క్లౌడ్ కవర్ ఉన్న సమయంలో కూడా స్పష్టమైన ఉపగ్రహ చిత్రాలను అందించగలదు.
క్లీన టెక్, మొబిలిటీ & రోబోటిక్స్‌లో ఆకర్షణ
ఇతర రంగాల్లో భారత్ నుండి ఎంపికైన స్టార్టప్‌లు సుస్థిర భవిష్యత్తు వైపుగా దారితీస్తున్నాయి. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ (Exponent Energy) చూస్తే, ఇది కూడా అద్భుతమైన స్టార్టప్.. 15 నిమిషాల్లో EVల చార్జింగ్ పూర్తి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. ఇంకా షార్టేజ్ సమస్యను పరిష్కరిస్తోంది. ఇక ది ఈప్లేన్ కంపెనీ (The ePlane Company), ఈ సంస్థ సిటీ ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను రూపొందిస్తోంది. ఇది భవిష్యత్తు మేఘ నగరాలకు మార్గదర్శిగా నిలవబోతోంది. సిన్ఎల్ఆర్ (CynLr), అత్యంత క్లిష్టమైన పారిశ్రామిక పరికరాల ఆటోమేషన్ కోసం దృశ్య ఆధారిత రోబోటిక్స్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తోంది.
హెల్త్‌కేర్, సర్వీసెస్, డిజిటల్ రంగాలు
డెజీ (Dezy), ఈ సంస్థ AI ఆధారిత డెంటల్ కేర్ సేవలను అందించే సంస్థ, పెద్దఎత్తున ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఉంది. సోలార్‌స్క్వేర్ (SolarSquare), ఇది ఇండివిడ్యువల్ హోమ్‌ల కోసం Rooftop Solar సిస్టమ్స్‌ను సరళమైన విధంగా అమలు చేసే టెక్నాలజీని అందిస్తుంది. ఇక ఫ్రైట్ టైగర్ (Freight Tiger), ఇది లాజిస్టిక్స్ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ, స్మార్ట్ ఫ్రైట్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈక్వల్ (Equal) అనే సంస్థ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో డేటా షేరింగ్ మరియు ఐడెంటిటీ వెరిఫికేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించగల ఆధునిక పరిష్కారంతో వస్తోంది.
టెక్ ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక స్థానం
WEF టెక్నాలజీ పయనీర్స్ ప్రోగ్రామ్ ఈ ఏడాది 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో మార్పు తీసుకువచ్చే స్టార్టప్‌లకు గుర్తింపు లభిస్తుంది. WEF ఇన్నోవేషన్ అధిపతి వెరెనా కుహ్న్ మాట్లాడుతూ, ఇన్నోవేషన్‌లో ఒంటరిగా విజయం సాధించడం సాధ్యపడదు. కమ్యూనిటీ అవసరం. ఈ ప్రోగ్రామ్ అలాంటి కమ్యూనిటీని అందిస్తుందని అన్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుండి వచ్చిన అత్యధిక కంపెనీలు, దేశం ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతున్నదానికి నిదర్శనమని అన్నారు. సిలికాన్ వ్యాలీ తర్వాత టెక్ కేంద్రంగా భారత్ ఎదుగుతోందని WEF స్పష్టం చేసింది.