Indian Stock Market Rally: గత వారం భారతీయ స్టాక్ మార్కెట్ బుల్ ర్యాలీని కొనసాగించింది. మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉండటంతో, విదేశీ, దేశీయ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెట్టారు. దాంతో BSE సెన్సెక్స్ 1,650 పాయింట్లు పెరిగి రెండు శాతం వృద్ధి సాధించింది. టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో తొమ్మిది సంస్థలు కలిపి రూ. 2,34,565.53 కోట్ల మార్కెట్ క్యాప్‌ను పెంచుకోవడం గమనార్హం.
ఈ వృద్ధికి ప్రధాన కారణాలు మూడు ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారుల (FIIs) తిరిగి ప్రవేశం, దేశీయ ఆర్థిక ప్రగతిపై నమ్మకం, కార్పొరేట్ లాభాల పెరుగుదల వంటివి మార్కెట్ను పెంచాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలికాం మరియు ఎనర్జీ రంగాల్లో వృద్ధి బాగా కనిపించింది. 5జి, డిజిటలైజేషన్, ముడి చమురు ధరల స్థిరత్వం వంటి అంశాలు మార్కెట్‌ను పుంజుకునేలా చేశాయి.
లాభాల్లో రిలయన్స్ టాప్
ఈ వృద్ధిలో ప్రముఖంగా నిలిచింది రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అనే చెప్పాలి. ఒక్క వారం వ్యవధిలో RIL మార్కెట్ విలువ రూ. 69,556.91 కోట్లు పెరిగింది. ప్రస్తుతం దాని మార్కెట్ క్యాప్ రూ. 20.51 లక్షల కోట్లకు చేరుకుంది. రిటైల్, టెలికాం, మరియు డిజిటల్ సేవల విభాగాల్లో విస్తరణ RILని ముందుకు నడిపిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ రూ. 51,860.65 కోట్ల మార్కెట్ క్యాప్ వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. 5G సేవల విస్తరణ, డేటా వినియోగం పెరుగుదల దీనికి దోహదం చేశాయి.
బ్యాంకింగ్ రంగంలో ర్యాలీ
HDFC బ్యాంక్ రూ. 37,342.73 కోట్ల మార్కెట్ క్యాప్ వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం దాని విలువ రూ. 15.44 లక్షల కోట్లు. అలాగే ICICI బ్యాంక్ రూ. 24,649.73 కోట్ల లాభంతో రూ. 10.43 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను చేరుకుంది. బ్యాంకింగ్ రంగంలో రుణాల పెరుగుదల, డిజిటల్ బ్యాంకింగ్ ఆధారిత వృద్ధి కీలకంగా మారాయి. బజాజ్ ఫైనాన్స్ రూ. 26,037.88 కోట్ల మార్కెట్ క్యాప్ వృద్ధి సాధించింది. దేశీయ రిటైల్ క్రెడిట్ డిమాండ్ పెరగడం దీని విజయానికి కారణంగా చెప్పవచ్చు. LIC రూ. 13,250.87 కోట్ల లాభంతో రూ. 6.05 లక్షల కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రూ. 8,389.15 కోట్ల మార్కెట్ క్యాప్ వృద్ధిని నమోదు చేసింది.
ఒక్క ఇన్ఫోసిస్ నష్టాల్లో..
TCS రూ. 3,183.91 కోట్ల మార్కెట్ క్యాప్ వృద్ధిని నమోదు చేసింది. కానీ టాప్-10లో ఇన్ఫోసిస్ మాత్రమే నష్టాల్లో నిలిచింది. దాని విలువ రూ. 5,494.8 కోట్లు తగ్గి రూ. 6.68 లక్షల కోట్లకు చేరింది. గ్లోబల్ టెక్ బడ్జెట్‌ల తగ్గుదల, ప్రాజెక్ట్‌ల ఆలస్యం ఇందుకు కారణం కావచ్చు.
మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్-10 కంపెనీలు
మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిందిి. ఆ తర్వాత స్థానాల్లో HDFC బ్యాంక్, టీసీఎస్ (TCS), భారతీ ఎయిర్‌టెల్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, LIC, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యునిలివర్ ఉన్నాయి. అయితే ఈ వారం స్టాక్ మార్కెట్ పెరుగుదల దేశ ఆర్థిక స్థిరత్వం మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. టాప్ కంపెనీల్లో గణనీయమైన మార్కెట్ క్యాప్ వృద్ధి చూసినప్పటికీ, టెక్నాలజీ రంగం మిశ్రమ ప్రతిస్పందనను అందించింది.