Sensex Nifty Fall: గతవారం లాభాల జోరును కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు హెచ్1బి వీసాలపై ట్రంప్ చేసిన ఒకేఒక్క ప్రకటనతో కుప్పకూలాయి. ప్రధానంగా నేడు ఇంట్రాడేలో తొలుత నష్టాలు పరిమితంగానే కొనసాగినప్పటికీ చివరికి వచ్చే సరికి ఐటీ స్టాక్స్ నష్టాలు కీలక బెంచ్ మార్క్ సూచీలను భారీ నష్టాల్లోకి నెట్టేశాయి.
హెచ్1బి వీసాలు ఎక్కువగా వినియోగించే ఐటీ రంగంపై లక్ష డాలర్ల ఫీజు పెద్ద పిడుగులా పడింది. టెక్ కంపెనీలు కోలుకోలేని విధంగా ట్రంప్ చర్యలు ఉండటం.. భవిష్యత్తు టెక్ రంగం ఎదుర్కొనే కొత్త కష్టాలకు ప్రారంభంగా చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదాన్ని ట్రంప్ చాలా సీరియస్ గా తీసుకున్న విషయం దీని నుంచి అర్థం అవుతోంది. వందల మంది హెచ్1బి హోల్డర్లను తీసుకొచ్చే వేల మంది అమెరికన్ల స్థానాలను చాలా కంపెనీలు అమెరికాలో భర్తీ చేయటాన్ని అడ్డుకోవటానికి ఇది దోహదపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు.
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ క్లోజింగ్ పరంగా సెన్సెక్స్ 82,160.14 వద్ద 466 పాయింట్లు (0.56%) క్షీణతతో ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 సూచీ 25,202.20 వద్ద సుమారు 124 పాయింట్ల (0.49%) తగ్గింపును నమోదు చేసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 55,280 వద్ద సుమారు 178 పాయింట్ల క్షీణతకు గురైంది. కొంత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటం కూడా మార్కెట్ల పతనానికి దారితీసిందని నిపుణులు అంటున్నారు.
ఈ క్రమంలో మార్కెట్లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ వివరాలు ఎన్ఎస్ఈలో పరిశీలిస్తే.. బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. ఇదే సమయంలో టాటా మోటార్స్, ట్రెంట్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, ఎల్&టీ, ఐటీసీ స్టాక్స్ టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని సోమవారం ముగించాయి.


