Sensex Nifty: భారత స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ ప్రారంభం నుంచి లాభాల దిశను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలపై కొద్ది రోజులుగా మార్కెట్లోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి జీఎస్టీపై తీసుకున్న నిర్ణయాలు ప్రకటించటంతో గురువారం దేశీయ మార్కెట్లు ఫుల్ జోష్ లో ప్రారంభం అయ్యాయి.
ఉదయం 9.46 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 620 పాయింట్ల లాభంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 175 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 265 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 200 పాయింట్లకు పైగా లాభాలతో ఉన్నాయి. ప్రధానంగా నేడు మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలకు చెందిన స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. దీని తర్వాత కన్జూమర్ డ్యూరబుల్ కంపెనీలు కూడా భారీ కొనుగోళ్ల మద్దతును ఇన్వెస్టర్ల నుంచి చూస్తున్నాయి.
ఆర్థిక మంత్రి జీఎస్టీ మార్పుల ప్రకటన తర్వాత స్టేషనరీ, పన్నీర్, కార్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ఉత్పత్తుల రేట్లు తగ్గనున్నాయి. ఇదే క్రమంలో ఆటో రంగానికి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, హీరో మోటార్స్, ఎస్కార్ట్స్, అషోర్ లేలాండ్ వంటి కంపెనీలు కూడా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో లాభపడనున్నాయని తేలింది. దీపావళికి జీఎస్టీ రేట్ల తగ్గింపులు అమలులోకి వస్తాయి కాబట్టి ఈ కంపెనీల షేర్లు మంచి డిమాండ్ వాతావరణాన్ని చూస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక హేతుబద్ధత వైపు ఒక నమూనా మార్పును సూచిస్తాయని HDFC సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ అన్నారు. పాడి, మందులు, ఆహారం వంటి ముఖ్యమైన వస్తువులపై రేటు కోతలు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇది దేశంలో డిమాండ్ పెరగటానికి వ్యాపారాలు ఆర్థికంగా బలపడటానికి దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మోడీ సర్కార్ ఆదాయపు పన్ను పరిమితి పెంచటం నుంచి ప్రస్తుతం జీఎస్టీ రేట్ల సంస్కరణల వరకు అన్నింటినీ దేశంలో తగ్గిన వృద్ధి, నెమ్మదించిన ఆర్థిక డిమాండ్ రివైవ్ చేయటానికి ఉద్ధేశించినవిగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో డిమాండ్ పెంచటానికి ఇదొక మార్గంగా కేంద్రం భావిస్తోందని చెబుతున్నారు.


