Market Closing: సెప్టెంబర్ 23న ఇంట్రాడేలో భారీ నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మార్కెట్ల క్లోజింగ్ సమయానికి మళ్లీ బలమైన రికవరీని చూపాయి. రోజులో 400 పాయింట్లు విలువ కోల్పోయిన తరువాత సెన్సెక్స్ తిరిగి 82,177.14 వద్ద ముగిసింది. ఇదే సమయంలో మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ నష్టాల నుంచి తేరుకున్న తర్వాత 25,199 స్థాయికి చేరుకుంది. అయితే మార్కెట్ల భారీ రికవరీకి మూడు ప్రధాన కారణాలు దోహదపడ్డాయి.
మొదటగా వడ్డీ రేటు తగ్గింపుల ఆశలు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ స్టీఫెన్ మిరాన్ ప్రస్తుతం ఉన్న ఫెడ్ రేట్లు తక్కువయ్యేటటువంటి స్థాయిలో ఉండాలని సూచించారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి కీలక వడ్డీ రేట్లు మళ్లీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇది సంకేతం. దీనికి అనుగుణంగా భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను భవిష్యత్తులో తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేయటం మార్కెట్లను సానుకూలంగా ఇవాళ ముందుకు సాగటానికి దోహదపడింది.
ఇక రెండవది గ్లోబల్ మార్కెట్లలో సానుకూల కదలికలు ఇండియన్ ఈక్విటీలకు పాజిటివ్ బూస్ట్ ఇచ్చాయి. ఆసియా మార్కెట్లు స్తిరంగా ఉండగా అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ కూడా పెరుగుతాయని చూపించాయి. ఈ గ్లోబల్ మూమెంట్ ఇంట్రాడే మార్కెట్లపై మంచి ఇంపాక్ట్ చూపింది.
ఇక చివరిగా జీఎస్టీ రేట్ల తగ్గింపు అమలులోకి రావటంతో బ్యాంకింగ్, ఆటోమొబైల్ స్టాక్స్ లో కొనుగోళ్లు పెరిగాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.5%కి పెరిగింది. జీఎస్టీ తగ్గింపుతో ఒక్కరోజే మారుతీ 30వేల కార్లు అమ్మి రికార్డ్ సృష్టించడంతో ఇన్వెస్టర్లు షేర్ల కోసం ఎగబడటం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్ల మేర పెరిగింది. జీఎస్టీ సంస్కరణలతో అత్యధికంగా లాభపడ్డ ఆటో కంపెనీగా నిలిచింది. ఇదే క్రమంలో టాటా మోటార్స్, మహీంద్రా లాంటి ఇతర కంపెనీలు కూడా అమ్మకాల కారణంగా బలమైన కొనుగోళ్లకు లోనయ్యాయి. అలాగే ఎమ్ఆర్ఎఫ్ టైర్ల తయారీ సంస్థ స్టాక్ రేటు రికార్డ్ స్థాయిలో పెరిగి చివరికి ఒక్కో షేరు రూ.1,55,935 వద్ద క్లోజ్ అయ్యింది.


