Market Update: భారత స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం ఫ్లాట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒకపక్క ఐపీవోల కోలాహలం కొనసాగుతుండగా.. మరోపక్క ట్రంప్ తాజా ఆటో, ఫార్మా టారిఫ్స్ ప్రభావంతో ఇన్వెస్టర్లు కొంత ఆచితూచి ముందుకు సాగే ధోరణిని కొనసాగిస్తున్నారు.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 165 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 110 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 347 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అలాగే గత వారం రోజులుగా భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడగా.. నెల చివరిలో కొంత ఆశాజనకంగా ఉండటం గమనించవచ్చు.
ఈ క్రమంలో సీగల్ ఇండియా, ఆజాద్ ఇంజి, జాగ్లే ప్రీపెయిడ్, వాస్కాన్ ఇంజనీర్స్, అట్లాంటా ఎలక్ట్రికల్స్, గణేష్ కన్స్యూమర్, టాటా మోటార్స్ స్టాక్స్ ఫోకస్ లో కొనసాగుతున్నాయి. అలాగే టైటాన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ కంపెనీల షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నిఫ్టీ సూచీలో టాప్ లూజర్లుగా ఉన్నాయి.
ఈరోజు మార్కెట్లో ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు మాత్రం లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
నిపుణుల మాట ఇదే..
గత 6 ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ నిరంతరం పతనమైంది. నిఫ్టీని సపోర్ట్ జోన్ అయిన 24800 స్థాయి కంటే దిగువకు లాగింది. సాంకేతికంగా మార్కెట్ బలహీనంగానే ఉంది.. కానీ అది ఓవర్‌సోల్డ్ స్థాయిలకు చేరుకుంది. అందువల్ల ఎప్పుడైనా స్వల్పకాలిక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైనా ర్యాలీని నిలబెట్టుకోవాలంటే మార్కెట్‌కు సానుకూల వార్తలు అవసరం, ముఖ్యంగా USతో వాణిజ్య ఒప్పందంపై. అందువల్ల మార్కెట్ దృష్టి దానిపైనే ఉంటుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ VK విజయకుమార్ చెప్పారు. ప్రస్తుత వృద్ధి-ద్రవ్యోల్బణ డైనమిక్స్ రేటు తగ్గింపుకు హామీ ఇవ్వవు. అందువల్ల ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగానికి మద్దతుగా RBI ప్రతికూల సందేశాన్ని పంపుతూ రేట్లను నిలుపుకునే అవకాశం ఉంది.


