Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆగస్టు 27న అమెరికా అదనపు టారిఫ్స్ అమలులోకి రావటంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొన్ని రంగాల్లో అమ్మకాల పరంపరను కొనసాగించటంతో మార్కెట్లు నష్టాలను చూశాయి. అయితే ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ దీర్ఘకాలం కొనసాగదనే వార్తలు ఇన్వెస్టర్లను ఊపిరిపీల్చుకునేలా చేశాయి.
ఉదయం 9.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ లాభాల నుంచి స్వల్ప నష్టాల్లోకి జారుకుని 16 పాయింట్ల లాస్ లో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ కూడా ఇదే దారిలో కొనసాగి 5 పాయింట్ల మేర నష్టంలోకి జారుకుంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 50 పాయింట్ల లాభంతో ఉండగా.. మిడ్ క్యాప్ సూచీ మాత్రం తన నష్టాల పరంపరను కొనసాగిస్తూ 300 పాయింట్లకు పైగా లాస్ లో కొనసాగుతోంది. ఉదయం ఉత్సాహంగా లాభాలతో ట్రేడింగ్ మెుదలుపెట్టిన సూచీలు కొన్ని నిమిషాల్లో నష్టాల్లోకి జారుకోవటం మార్కెట్లలో ఒడిదొడుకులను అలాగే భయాలు ఇంకా పోలేదనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
ఉదయం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, జియో ఫైనాన్షియల్, టాటా స్టీల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ నిఫ్టీలో గెయినర్లుగా నిలవగా.. శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, టైటాన్ కంపెనీ, ఎల్ అండ్ టి, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. మార్కెట్లు లాభాల స్వింగ్ నుంచి ఫ్లాట్ ట్రేడింగ్ కి మారటంతో ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.


