Sensex-Nifty: దేశీయ స్టాక్ మార్కెట్లు వాస్తవానికి సెప్టెంబర్ నెలలో మంచి రివకవరీని కనబరుస్తున్నాయి. ట్రంప్ చేష్టలతో భారత్ వెనక్కి తగ్గదని మోదీ సర్కార్ పలు వేదికలపై తెగేసిచెబుతున్న వేళ భారతీయ ఇన్వెస్టర్లకు సైతం ఈ విషయంపై క్లారిటీ వస్తోంది. దీనికి తోడు జపాన్ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలు బెంచ్ మార్క్ సూచీలను బుల్ జోరులో కొనసాగేందుకు దన్నుగా నిలబడుతున్నాయి.
ఇక మంగళవారం మార్కెట్లను కొత్త దిశగా నడిపిస్తున్న అంశాల్లో ఒకటి ఈనెలలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు. ఒకపక్క అమెరికాలో ప్రస్తుతానికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్లు డేటాలు చెబుతుంటే మరోపక్క యూఎస్ పెద్ద ఆర్థిక సంక్షోభానికి ముంగిట్లో ఉందని.. త్వరలోనే రెసిషన్ వచ్చే ప్రమాదం ఉందనే నిపుణుల హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ముందుగా రేట్ల తగ్గింపుపైనే ఎక్కువగా ఆశలతో ఉండటం సెన్సెక్స్, నిఫ్టీలను ముందుకు నడిపిస్తోంది. దీనికి తోడు రాబోయే అమెరికా ద్రవ్యోల్బణం డేటా కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నేడు మార్కెట్లో సూచీలు లాభాల్లో కొనసాగటానికి మరో కారణం ఐటీ స్టాక్స్ ర్యాలీ. నిఫ్టీ ఐటీ సూచీ ఇంట్రాడేలో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలో 1.68 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో పీఎస్యూ బ్యాంక్స్, మెటల్స్, ఎనర్జీ, ఇన్ ఫ్రా, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లు కూడా లాభాల ట్రెండ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.39 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీల పనితీరును పరిశీలిస్తే.. సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 77 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 46 పాయింట్ల లాభంతో ఉండగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 27 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్ నిఫ్టీలో యాక్టివ్ ట్రేడింగ్ కలిగిన షేర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్, టాటా మోటార్స్ నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


