Silver Rally: 2025లో వెండి ధరలు భారతదేశంలో భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్వచ్చమైన వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్షా 87వేలను తాకటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60 శాతానికి పైగా పెరిగాయి.ప్రస్తుతం వెండికి ఉన్న మెుత్తం డిమాండ్ భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. వీటిలో 60 శాతం వరకు పారిశ్రామిక అవసరాలకు వెళుతుండగా.. మిగిలిన 40 శాతం మాత్రమే వాస్తవ రిటైల్ వినియోగం అని తేలింది.
వెండి రేట్లు అకస్మాత్తుగా పెరగటానికి కారణాలు..
1. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితితో పాటు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించటం వంటి అంశాలు వెండి లాంటి సురక్షిత ఆస్తులకు పెట్టుబడిదారులకు వ్యూహాత్మక పెట్టుబడులుగా మారుతున్నాయి.
2. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి ప్రధానమైన మెటల్ గా వినియోగించబడుతోంది. అలాగే ఫోటోవోల్టాయిక్ సెల్స్, సెమీకండక్టర్స్ వంటి వ్యవస్థల్లో వెండి వినియోగం బాగా పెరిగింది ఇటీవలి కాలంలో.
3. ప్రపంచంలో వెండి నికర సరఫరాలో కొరత ఉండడంతో ధరలు పెరిగాయి. ముఖ్యంగా లండన్, అమెరికా మార్కెట్లలో సరఫరా కొరత తీవ్రమైనది.
4. డాలర్ బలహీనపడినప్పుడు వెండి, -బంగారం ధరలు పెరగడం సహజం.
రేట్ల ర్యాలీపై నిపుణుల మాట ఇదే..
ప్రముఖ విశ్లేషకులు, బ్రోకరేజ్ సంస్థల ప్రకారం దీపావళి 2025 నాటికి వెండి ధరలు రూ.1,48,000 – రూ.1,50,000 మధ్య స్థాయిలోనే ఉండొచ్చని చెబుతున్నారు.కానీ వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రతి రోజూ వెండి రేటు కేజీకి వేలల్లో పెరగటంతో అటు అమ్మేవారికీ, ఇటు కొంటున్నవారికీ అంతుపట్టడం లేదు.
మాక్విరిస్, యూబీఎస్ వంటి విదేశీ ఫిన్-ఇన్‌స్టిట్యూట్స్ వెండి రేట్లు 2025 చివరినాటికి ఔన్సు రేటు 35 డాలర్ల నుంచి 50 డాలర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. అంటే రాబోయే 12–24 నెలల్లో కూడా ఈ స్థాయికి వెండి చేరొచ్చు.సరఫరా డిమాండ్ మధ్య వత్యాసం ప్రస్తుతం ఉన్న స్థాయిల్లోనే కొనసాగితే 2026 నాటికి మరింత రేట్ల పెరుగుదలకు అవకాశం ఉందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెండి కొనాలనుకుంటున్న వారు భౌతికంగానే కాకుండా ఈటీఎఫ్స్ వంటి డిజిటల్ మార్గాల్లో కూడా ఇన్వెస్ట్ చేయటం వల్ల తక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెుత్తానికి భారత మార్కెట్‌లో వెండి ధరలు 2025లో రికార్డు స్థాయికి పెరడానికి పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడిదారుల డిమాండ్, సరఫరా లోపం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కలిసి ప్రభావితం చేశాయి. ఈ ట్రెండ్ 2026లో కూడా కొనసాగే అవకాశముందని ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తెలుస్తోంది


