Sunday, February 8, 2026
Homeబిజినెస్IndiGo : కుప్పకూలిన ఇండిగో లాభాలు..ఆకాశం నుంచి నేలకు...!

IndiGo : కుప్పకూలిన ఇండిగో లాభాలు..ఆకాశం నుంచి నేలకు…!

IndiGo Profits Crash : భారత గగనతలంలో రారాజుగా వెలుగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విమానాల రద్దు, కొత్త ప్రభుత్వ నిబంధనలు ఆ కంపెనీ లాభాల విమానాన్ని ఒక్కసారిగా కిందికి దించేశాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.

- Advertisement -

ఆకాశం నుంచి నేలకు.. లాభాల పతనం
గతేడాది ఇదే సమయంలో రూ. 2,448.8 కోట్ల లాభాలతో జోరు మీదున్న ఇండిగో, ఈ ఏడాది కేవలం రూ. 549.1 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే కంపెనీ లాభాల్లో ఏకంగా 78 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం పెరిగినప్పటికీ, లాభాల విషయంలో మాత్రం ఇండిగో తీవ్రంగా వెనకబడింది.

లాభాలకు గండికొట్టిన ఖర్చులు
ఇండిగో లాభాలు ఇంత దారుణంగా పడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయడం కోసం ఇండిగో ఏకంగా రూ. 969 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది కంపెనీ బ్యాలెన్స్ షీట్‌పై పెను భారాన్ని మోపింది.గత నెలలో పెద్ద ఎత్తున విమానాలు రద్దు కావడం, సర్వీసుల్లో అంతరాయం కలగడం వల్ల మరో రూ. 577 కోట్లు నష్టం వాటిల్లింది.మొత్తంగా చూస్తే, ఈ రెండు కారణాల వల్లే ఇండిగోపై రూ. 1,546 కోట్ల అదనపు భారం పడింది.

ఆదాయంలో మాత్రం జోరు
లాభాలు తగ్గినా, ఇండిగో సేవలను వినియోగించుకునే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. గతేడాది రూ. 22,992.8 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం, ఈ త్రైమాసికంలో రూ. 24,540.6 కోట్లకు పెరిగింది. దీన్ని బట్టి ప్రయాణికుల డిమాండ్ బలంగానే ఉన్నప్పటికీ, నిర్వహణ ఖర్చులు పెరగడమే కంపెనీని దెబ్బకొట్టిందని అర్థమవుతోంది.

Amazon : అమెజాన్‌లో మళ్ళీ లేఆఫ్స్..16,000 మంది ఉద్యోగులు అవుట్

 

సాధారణంగా డిసెంబర్ త్రైమాసికం విమానయాన రంగానికి ‘పండగ’ లాంటిది. సెలవులు, పర్యాటక సీజన్ వల్ల లాభాలు ఎక్కువగా ఉండాలి. కానీ, ఇండిగో విషయంలో అదనపు ఖర్చులు ఊహించని విధంగా వచ్చి పడ్డాయి. అయితే, భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్స్ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని, ప్రస్తుతానికి ఇది కేవలం ఒక తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస విమానాల రద్దుతో ప్రయాణికుల అసహనానికి గురైన ఇండిగో, ఇప్పుడు ఆర్థికంగా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. మరి రాబోయే రోజుల్లో ఈ నష్టాల నుంచి ఇండిగో ఎలా కోలుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News