Saturday, July 12, 2025
Homeబిజినెస్Infosys Against Overtime : ఇన్ఫోసిస్ “ఓవర్‌ టైమ్‌కు నో!” అంటోంది

Infosys Against Overtime : ఇన్ఫోసిస్ “ఓవర్‌ టైమ్‌కు నో!” అంటోంది

Infosys Working Hours: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపడుకు నారాయణ మూర్తి ఇటీవల భారతీయులు వారానికి 70 గంటలు పనిచేయాలని హితవు పలికారు. కానీ మరోవైపు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) మాత్రం ఉద్యోగుల పని గంటలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగుల ఆరోగ్యం, పని జీవిత సమతుల్యత (work-life balance)ను పరిరక్షించడానికి, సంస్థ అంతర్గతంగా ఓ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.

- Advertisement -

ఇన్ఫోసిస్ హెచ్ ఆర్ (HR) బృందం ఉద్యోగుల రోజువారీ పని గంటలను గమనిస్తోంది. ఉద్యోగులు రోజుకు 9.15 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నట్లుగా కనిపిస్తే, వారికి ప్రత్యేకమైన ఇమెయిల్‌ల ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచి పనిచేసే వారిని టార్గెట్ చేస్తూ, సాధారణ పని షెడ్యూల్‌ను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈమెయిల్‌లలో ఉద్యోగులు విరామాలు తీసుకోవాలని, పని తర్వాత రిలాక్స్ కావడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాలని స్పష్టంగా పేర్కొంటున్నారు. “పని తర్వాత డిజిటల్‌గా డిస్‌కనెక్ట్ కావాలి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి” అంటూ ఇన్ఫోసిస్ హెచ్ఆర్ సందేశం ఇస్తోంది.

హైబ్రిడ్ మోడల్‌ వల్లే..

2023 నవంబర్ నుంచి ఇన్ఫోసిస్ “రిటర్న్ టు ఆఫీస్” విధానాన్ని అమలు చేస్తోంది. ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పనిచేయాల్సిన ఈ విధానం వల్ల, ఇంటి నుంచి పనిచేసే రోజుల్లో పని గంటలు పెరిగినట్టు సంస్థ గమనించింది. అందుకే కంపెనీ తాజాగా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సంస్థలో 3.2 లక్షలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో చాలామందిలో అధిక పని కారణంగా శారీరక, మానసిక సమస్యలు, అసమతులిత జీవనశైలి, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.

బాస్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా..

ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ సంస్కరణలు కంపెనీ బాస్ లేదా సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి. 2023లో జరిగిన ఒక సదస్సులో మూర్తి యువత వారానికి 70 గంటలు పని చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే యువత ఎక్కువ పని చేయడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన పనివారాన్ని ఐదు రోజులకే పరిమితం చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. అయితే ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. కొందరు మూర్తి దృక్పథాన్ని సానుకూలంగా తీసుకోగా, మరికొందరు ప్రస్తుత తరం ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విమర్శలు గుప్పించారు.

ఉద్యోగుల శ్రేయస్సే ముఖ్యం

ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా, బాధ్యతాయుతమైన నిర్ణయంగా భావించబడుతోంది. సంస్థ పేర్కొన్నట్టుగా ఉద్యోగుల అంకితభావం అమూల్యమైనదైనా, ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక వృత్తిపరమైన స్థిరత్వానికి పని-జీవిత సమతుల్యత కీలకమైంది. ఇన్ఫోసిస్ సంస్థ జారీ చేసిన సందేశంలో: “మీ శ్రేయస్సు మాకు ముఖ్యమైనది, అందుకే మీరు మీ పని గంటలను మితంగా ఉంచాలని కోరుతున్నాము” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News