Infosys New Jobs: దేశంలో ఐటీ రంగం కొంతకాలంగా నెమ్మదించిందనే పరిస్థితుల్లో, ఇన్ఫోసిస్ నుంచి కొత్త ఆశలు కలిగించే సమాచారం ఒకటి బయటకు వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా నిలిచిన ఇన్ఫోసిస్, ఈ కాలంలో ఉద్యోగాల సంఖ్య, వేతనాల పెంపుదల, బోనస్ చెల్లింపులపై నిర్ణయాలు తీసుకుంది.
9 శాతం అధికం..
ఈ త్రైమాసికంలో సంస్థకు రూ. 6,921 కోట్లు నికర లాభం వచ్చినట్లు అధికారికంగా వెల్లడించారు. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం అధికమైంది. ఇదే సమయంలో ఉద్యోగుల సంఖ్య 3,23,788కి పెరిగిందని కంపెనీ తెలిపింది. అంటే గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య సుమారు 8 వేల మందితో పెరిగినట్టు అర్థం.
20 వేల మంది ఫ్రెషర్లను…
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్‌కా మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 20 వేల మంది ఫ్రెషర్లను నియమించనుందని ప్రకటించారు. ఇది ప్రస్తుతం ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న నూతన విద్యార్థులకు మంచి శుభవార్తగా మారింది. సంస్థ మున్ముందు కూడా నియామకాలు కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు.
70 శాతం జూనియర్ ఉద్యోగులకు…
ఈ త్రైమాసికంలో ఉద్యోగులకు అధిక వేరియబుల్ పే (బోనస్) చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. గతంలో టీసీఎస్ తన 70 శాతం జూనియర్ ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే ఇచ్చినట్టు ప్రకటించగా, ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా అటువంటి దిశగా అడుగులు వేసింది.
వేతనాల విషయానికొస్తే, గతేడాది వేతన పెంపు ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి 2025 నుంచి తొలి దశ వేతన పెంపు అమలులోకి వచ్చిందని సంస్థ వెల్లడించింది. అలాగే ఏప్రిల్ 2025 నుంచి రెండో విడత వేతన పెంపు అమలైనట్లు తెలిపింది. అయితే తదుపరి వేతనాల పెంపుపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదని జయేష్ సంఘరాజ్‌కా తెలిపారు.
అంతేగాక, ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం మాత్రం అట్రిషన్ రేటు. అంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోయిన వారి శాతం. జూన్ 2025 నాటికి ఈ రేటు 14.4 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది. అంటే కంపెనీ నుంచి చాలామంది ఇతర కంపెనీలకు మారుతున్న పరిస్థితి ఇది. ఇది కంపెనీకి సవాల్‌గా మారింది. ఐటీ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగులను నిలబెట్టుకోవడం సంస్థల ముందున్న ప్రధాన పరీక్షగా మారుతోంది.
Also Read: https://teluguprabha.net/business/how-to-apply-for-driving-license-online-without-visiting-rto/
ఈ అట్రిషన్ రేటు పెరుగుదల, ఉద్యోగుల మార్పులు, తద్వారా సంస్థల పనితీరుపై ప్రభావం చూపే అంశాలన్నీ ప్రస్తుతం పరిశ్రమలో చర్చకు దారి తీస్తున్నాయి. అయితే వేతన పెంపుదల, బోనస్‌ల చెల్లింపు వంటి అంశాల్లో సంస్థ తీసుకుంటున్న నడక, ఉద్యోగ అవకాశాల కల్పన, దీనివల్ల ఉద్యోగులకు కొంత భరోసాను కలిగించగలుగుతున్నాయి.


