AI : టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశం ఒక సరికొత్త విప్లవానికి దారితీస్తోంది. కానీ, ఈ విప్లవం సామాన్య ఉద్యోగికి వరమా లేక శాపమా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం అంటేనే జీవితానికి ఒక భరోసా. కానీ, ఇప్పుడు ‘ఏఐ’ అనే రెండక్షరాల పదం ఆ భరోసాను ప్రశ్నార్థకం చేస్తోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవం, చేతినిండా జీతం. కానీ, నేడు పరిస్థితి తలకిందులవుతోంది. ఒరాకిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని తొలగిస్తూ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక ఒకటే ప్రధాన కారణం కనిపిస్తోంది.. అదే ‘ఏఐ అప్ గ్రేడేషన్’. మనిషి చేసే పనిని ఒక మెషిన్ అంతకంటే వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తానంటే.. ఏ కంపెనీ అయినా మానవ వనరుల కంటే సాంకేతికతకే మొగ్గు చూపుతుంది. ఇదే ఇప్పుడు కోట్లాది మంది ఉద్యోగుల నిద్రను చెడగొడుతోంది.
నివేదికల ప్రకారం, కృత్రిమ మేధస్సు కేవలం శారీరక శ్రమనే కాదు, మేధో శ్రమను కూడా భర్తీ చేస్తోంది. ఒకప్పుడు వందల మంది డెవలపర్లు చేసే కోడింగ్‌ను ఇప్పుడు ఏఐ టూల్స్ నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల జూనియర్ లెవల్ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గిపోతోంది.వేల టన్నుల డేటాను విశ్లేషించడానికి ఇప్పుడు మనుషుల అవసరం లేకుండా ఏఐ అల్గారిథమ్స్ రంగంలోకి దిగాయి.చాట్‌బాట్‌ల రాకతో కస్టమర్ సర్వీస్ విభాగాల్లో మనుషుల ప్రాధాన్యత 60-70 శాతం వరకు తగ్గిపోయింది.
ప్రస్తుతం కంపెనీలు సాదాసీదా నైపుణ్యం ఉన్న వారి కంటే, ఏఐని సమర్థవంతంగా వినియోగించుకోగల వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. గతంలో పదేళ్ల అనుభవం ఉన్నా, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోతే ఏ క్షణమైనా పింక్ స్లిప్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు మెకానికల్ పనులకే పరిమితమైన ఆటోమేషన్, ఇప్పుడు ఆలోచించే స్థాయికి చేరడంతో, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారు సైతం భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటున్నారు.
ఏఐ అనేది ఉద్యోగాలను తినేసే రాక్షసి కాదు, అది కేవలం మన పని పద్ధతిని మార్చే ఒక సాధనం మాత్రమే. అయితే, ఈ మార్పును తట్టుకోవాలంటే పాత పద్ధతులను వదిలి, సరికొత్త నైపుణ్యాలను అలవరచుకోవాలి.

