Keyboard : టెక్నాలజీ మారుతోంది.. కాదు, మారుతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది! నిన్నటి వరకు కంప్యూటర్ అంటే కీబోర్డ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే టైపింగ్. కానీ, రాబోయే మూడేళ్లలో ఈ దృశ్యం పూర్తిగా మారిపోనుంది. మనం కీబోర్డ్ మీద వేళ్లతో చేసే పనిని, ఇకపై నోటి మాటతోనే పూర్తి చేయవచ్చని SAP CEO క్రిస్టియన్ క్లేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) పుణ్యమా అని వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అద్భుతమైన స్థాయికి చేరుకుంది. దీనివల్ల.. ఇకపై డేటా ఎంట్రీ కోసం గంటల తరబడి టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌తో మనం మాట్లాడితే చాలు, అవి పనులను చక్కబెట్టేస్తాయి. కీబోర్డ్ అవసరం లేని రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. వాయిస్ కమాండ్స్‌తోనే కోడింగ్ నుండి ఈమెయిల్స్ వరకు అన్నీ సాధ్యమవుతాయి.
1714లో హెన్రీ మిల్ టైప్ రైటర్ కాన్సెప్ట్‌తో మొదలైన కీబోర్డ్ ప్రయాణం.. దాదాపు 312 ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఇన్ని ఏళ్లుగా మనిషికి, మెషీన్‌కు మధ్య వారధిగా ఉన్న కీబోర్డ్ స్థానాన్ని ఇప్పుడు AI భర్తీ చేయబోతోంది. మన గొంతే ఇకపై మన కీబోర్డ్ కాబోతోంది.
SAP CEO మాటల ప్రకారం, డేటా ఎంట్రీ వంటి మాన్యువల్ వర్క్స్ చేసే వారికి రాబోయే రోజుల్లో గడ్డు కాలమే. AI ఎంత వేగంగా విస్తరిస్తుందో, అంతే వేగంగా పాత తరం ఉద్యోగాలను మింగేస్తోంది. టెకీలు తమ నైపుణ్యాలను పెంచుకోకపోతే, ఈ AI రేసులో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.

