Space To Industry: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO (ఇస్రో) దేశీయ పరిశ్రమలకు పెద్ద టెక్నాలజీని బదిలీ చేసింది. అంతరిక్ష వ్యాపారం దిశగా మరో ముందడుగు వేస్తూ, 10 ఆధునిక టెక్నాలజీలను ఆరు భారత కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈమేరకు న్యూ స్పేస్ ఇండియా లి. (NSIL), సంస్థలు, ఇన్ స్పేస్ (IN-SPACe) మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ బదిలీల ప్రధాన ఉద్దేశ్యం ఇస్రో వద్ద ఉన్న అధునాతన టెక్నాలజీలను ప్రైవేట్ కంపెనీలకు అందజేసి, దేశీయ రంగం ద్వారా వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించుకునేలా చేయడమే. అంతేకాదు, ఉపగ్రహ నిక్షేపణ, గ్రౌండ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జియోస్పేషియల్ అప్లికేషన్లలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉంది. విదేశీ టెక్నాలజీలపై ఆధారపడకుండా “మేడ్ ఇన్ ఇండియా స్పేస్ టెక్” పైన దృష్టి పెడుతోంది. ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయెన్‌కా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇస్రో వద్ద వృద్ధి చెందిన R&D టెక్నాలజీలు ఉన్నాయి. వాటిని ఇండస్ట్రీ మద్దతుతో వాణిజ్యరంగంలోకి తీసుకురావడం భారత్ అంతరిక్ష రంగ అభివృద్ధికి బలమైన అడుగు అని తెలిపారు.
ఏ సంస్థలకు ?
ఉపగ్రహ నిక్షేపణ వ్యవస్థలో ఉపయోగించే లేజర్ గైరోస్కోప్, సెరామిక్ సర్వో యాక్సిలరోమీటర్ అనే సాంకేతికతలను జెటాటెక్ టెక్నాలజీస్, హైదరాబాద్ అనే సంస్థకు బదిలీ చేశారు. ఇవి ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అత్యున్నత సాంకేతికతలుగా ఉన్నాయి. ఇప్పుడు దేశీయ పరిశ్రమలే వాటిని అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని సంపాదించాయి.
గ్రౌండ్ స్టేషన్ వ్యవస్థలకు సంబంధించిన మూడు ముఖ్యమైన సాంకేతికతలను అవంటెల్ మరియు జిస్ను కమ్యూనికేషన్స్ అనే సంస్థలకు బదిలీ చేశారు. వీటిలో సున్నిత తరంగాల నియంత్రణ, యాంటెన్నా గమనాల నిర్వహణ, సంక్లిష్ట ఫీడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటి వరకు ఇతర దేశాలపై ఆధారపడి కొనుగోలు చేసినవి.
వ్యవసాయ నిర్ణయాల కోసం ఉపయోగపడే తెగుళ్ళ ముందస్తు హెచ్చరిక నమూనా, పంట దిగుబడి అంచనా నమూనా అనే రెండు అమ్నెక్స్ ఇన్ఫోటెక్, అహ్మదాబాద్ అనే సంస్థకు బదిలీ చేశారు. ఇవి రైతులకు కీలకమైన సమాచారాన్ని అందించగలవు. నీటి వనరుల పర్యవేక్షణ కోసం రూపొందించిన కాంపాక్ట్ బథీమెట్రీ వ్యవస్థను జలకృతీ వాటర్ సొల్యూషన్స్, అహ్మదాబాదు అనే సంస్థకు అందించారు. ఇది వాయు నియంత్రిత పరికరాల ద్వారా నీటి లోతులు కొలవడంలో ఉపయోగపడుతుంది.
ఉద్గార నిరోధక పెయింట్ టెక్నాలజీని రామ్‌దేవ్ రసాయన పరిశ్రమ, అహ్మదాబాదు సంస్థకు బదిలీ చేశారు. ఇది మొదట్లో నిక్షేపణ రాకెట్ల కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీ కాగా, ఇప్పుడు పరిశ్రమల్లో వినియోగానికి దారితీస్తోంది.
స్వదేశీ అంతరిక్షాభివృద్ధికి వేదిక
ఇన్-స్పేస్ అనే సంస్థను 2020లో స్థాపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను పెంచేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా పని చేస్తోంది. ఇది అంతరిక్ష విభాగంలో స్వతంత్రంగా పని చేసే నోడల్ ఏజెన్సీగా నిలిచింది. ఇస్రో వద్ద ప్రామాణిక పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసిన ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి. వాటిని కేవలం ప్రయోగాల్లో కాకుండా వాణిజ్యపరంగా ఉపయోగించే దిశగా తీసుకెళ్లడంలో ఈ ఒప్పందాలు పెద్ద భూమిక వహిస్తున్నాయి. ఈ చర్యల ద్వారా భారత్‌లోనే ఉపగ్రహ నిర్మాణం, నిక్షేపణ, పంటల విశ్లేషణ, నీటి వనరుల పర్యవేక్షణ, పరిశ్రమల భద్రత వంటి అనేక విభాగాల్లో స్వయం సమృద్ధత సాధించవచ్చు.