ITR Filing: ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. సెప్టెంబర్ 15 చివరి తేదీ కావడంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి ఐటీ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోర్టల్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి.. పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఐటీఆర్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
చెల్లింపుదారుల సౌలభ్యం కోసం: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేయడానికి గతంలో సెప్టెంబర్ 15 చివరి తేదీగా ఉండేది. అయితే ఈ గడువు ముగియడానికి కొన్ని నిమిషాల ముందు సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ గడువును పెంచినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 16 వరకు ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం లభించింది.
అవసరమైన పత్రాలు: ఏఐఎస్ (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్)లో మీ ఆదాయం, టీడీఎస్, టీసీఎస్, పెట్టుబడులు తదితర వివరాలు ఉంటాయి. యజమాని జారీ చేసే ఫారం 16లో జీతంతో పాటుగా టీడీఎస్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్ ఫారాలకు ఎలాంటి పత్రాలు అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని మీ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి.
సరైన ఐటీఆర్ ఫారం ఎంచుకోవడం:
ఐటీఆర్-1 (సాహజ్): రూ. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు, సాధారణ వ్యక్తులకు.
ఐటీఆర్-2: ఐటీఆర్-1కి అర్హత లేనివారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం లేని వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్‌లకు.
ఐటీఆర్-3: వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్‌లకు.
ఐటీఆర్-4 (సుగమ్): వ్యాపార ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న నివాసితులకు, హెచ్‌యూఎఫ్‌లకు, పార్ట్‌నర్‌షిప్ సంస్థలకు.
ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ: incometax.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పాన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. e-File > Income Tax Returns > File Income Tax Return ఆప్షన్‌కు వెళ్లాలి. ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 2025–26 ఎంచుకుని.. ఆన్‌లైన్ మోడ్ ఎంపిక చేసుకోవాలి. మీకు వర్తించే ఐటీఆర్ ఫారంను ఎంచుకుని.. మీ ఆదాయం, మినహాయింపులు, పన్ను వివరాలను నమోదు చేయాలి. మీ రిటర్న్‌ను ప్రివ్యూ చేసి.. సరిచూసుకుని సమర్పించాలి. చివరగా.. ఆధార్ ఓటీపీ లేదా ఇతర మార్గాల ద్వారా ఈ-వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి.


