Jefferies on GST: ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి తిరిగి కోలుకుంటున్నాయి. నష్టాల ట్రెండ్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ తిరిగి పుంజుకుంటున్నాయి. మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో నష్టాలు తగ్గిన తర్వాత సెన్సెక్స్ 244 పాయింట్ల లాస్ లో కొనసాగుతుండగా నిఫ్టీ సూచీ 43 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా భారీ నష్టాల నుంచి తేరుకుని 127 పాయింట్ల నష్టంలో ఉంది. అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం వరుసగా 5వ ట్రేడింగ్ సెషన్లో కూడా భారీగానే నష్టాలను కొనసాగిస్తున్నాయి.
మార్కెట్లలో కొత్త ఆశలను రేకెత్తించిన ఒక కీలక కారణం జీఎస్టీ సంస్కరణలపై విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విడుదల చేసిన రిపోర్ట్ అని నిపుణులు అంటున్నారు. భారత ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ రేట్ల తగ్గింపు చర్యలు ఆటో రంగానికి మేలు చేస్తాయని, ప్రధానంగా టూవీలర్ల డిమాండ్ పెరగటంతో పాటు చిన్న ప్యాసింజర్ కార్ల కొనుగోళ్లు పుంజుకుంటాయని జెఫరీస్ పేర్కొంది. తక్కువ పన్నులు ప్రజల కొనుగోలు ఆసక్తిని పెంచుతుందని అలాగే ఎక్కువ మందికి సొంత వాహన కల నెరవేరటంతో పాటు మందగించిన డిమాండ్ సమయంలో ఆటో రంగానికి ఇదొక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుందని పేర్కొంది.
జెఫరీస్ రిపోర్ట్ రావటంతో టూవీలర్ తయారీదారు హీరో మోటొకార్ప్ స్టాక్ భారీగా లాభపడి నిఫ్టీ సూచీలో టాప్ గెయినర్ గా నిలిచింది. 26-28 ఆర్థిక సంవత్సరాల నాటికి టూవీలర్ అండ్ కార్ల సేల్స్ 2 నుంచి 6 శాతం వరకు పెరగొచ్చనే వచ్చిన అంచనాలు ఆటో రంగంలోని టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్, మారుతీ సుజుకీ, హుందాయ్ షేర్లలో ర్యాలీని ప్రేరేపించింది. ప్రధానంగా జీఎస్టీ తగ్గింపు టీవీఎస్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలకు ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయని బ్రోకరేజ్ తన రిపోర్టులో పేర్కొంది. ఇక కార్ల అమ్మకాల్లో దిగ్గజం మారుతీ సుజుకీ కూడా చిన్న కార్ల అమ్మకాల్లో గ్రోత్ చూడొచ్చని వెల్లడించింది జెఫరీస్.
కొన్ని రిపోర్టుల సమాచారం ప్రకారం ఆటో రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపులు దీపావళికి బదులుగా నవరాత్రి సమయం అంటే సెప్టెంబర్ 22, 2025 నాటికి అమలులోకి రావొచ్చని తెలుస్తోంది. ప్రకటన ఆలస్యం వల్ల పండుగ సేల్స్ దెబ్బతింటాయనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే జీఎస్టీ రేట్ల తగ్గింపుల గురించి సమాచారం కోసం మధ్యతరగతి ప్రజలు తాత్కాలికంగా తమ కొనుగోళ్లను నిలిపివేయటంతో ప్రస్తుతం బుక్కింగ్స్ భారీగా పడిపోయాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమెుబైల్ డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఈ విషయంపై వీలైనంత త్వరగా క్లారిటీ వస్తే మంచిదని పరిశ్రమ వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

