Jio Platforms IPO listing price : దలాల్ స్ట్రీట్‌లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ‘అంబానీ బ్రాండ్’ అంటేనే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం అనే నానుడిని మరోసారి నిజం చేస్తూ, రిలయన్స్ డిజిటల్ దిగ్గజం ‘జియో ప్లాట్‌ఫామ్స్’ భారత స్టాక్ మార్కెట్లలోకి అదరహో అనేలా అడుగుపెట్టింది. తొలిరోజే ఏకంగా రూ.12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించి దిగ్గజాలను సైతం నివ్వెరపరిచింది. ఇంతకీ ఈ మెగా లిస్టింగ్ వెనుక నమోదైన రికార్డుల పరంపర ఏమిటి? ఇది దలాల్ స్ట్రీట్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రీమియం ధమాకా: ఐపీఓ ఇష్యూ ధర రూ.1,119 కాగా, ఎన్ఎస్ఈ (NSE), బీఎస్ఈ (BSE)లలో ఏకంగా 21.36 శాతం ప్రీమియంతో ఒక్కో షేరు రూ.1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
దేశంలోనే నంబర్-2 కంపెనీగా అవతరణ: లిస్టింగ్ జోరుతో జియో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షణాల్లో రూ.12,50,586 కోట్లకు ఎగబాకింది. దీంతో మార్కెట్ విలువ పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను దాటేసి, దేశంలోనే రెండో అత్యంత విలువైన సంస్థగా స్థానం దక్కించుకుంది. సుమారు రూ.16 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రపీఠాన కొనసాగుతోంది.
రికార్డుల మోత మోగించిన ఐపీఓ: రూ.30,213 కోట్ల విలువైన ఈ మెగా పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, మొత్తం బిడ్ల డిమాండ్ రూ.7.4 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచ రికార్డును తిరగరాస్తూ ఏకంగా 1.39 కోట్ల దరఖాస్తులు రావడం భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది.

