Electric Car : ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో సరికొత్త విప్లవానికి కియా మోటార్స్ శ్రీకారం చుట్టింది. స్టైలిష్ లుక్, అదిరిపోయే రేంజ్, ఆధునిక సాంకేతికత కలగలిసిన తన సరికొత్త చిన్న ఎలక్ట్రిక్ కారు ఈవీ2ని గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించి అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రస్సెల్స్‌లో జరుగుతున్న మోటార్ షో వేదికగా పరిచయమైన ఈ కారు, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని సామాన్యులకు మరింత దగ్గర చేయనుంది. కియా నుంచి వస్తున్న అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారుగా ఈవీ2 ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
డిజైన్ పరంగా అదరహో
కియా ఈవీ2ని చూస్తే ఇది ఒక చిన్న కారులా కాకుండా, ఒక పవర్ ఫుల్ ఎస్‌యూవీలా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కియా తన ప్రీమియం మోడళ్లైన ఈవీ6, ఈవీ9 ల నుంచి తీసుకున్న డిజైన్ ఎలిమెంట్స్. కారు ముందు భాగంలో కియా సిగ్నేచర్ ‘టైగర్ ఫేస్’ లుక్ మరియు బాక్సీ షేప్ దీనికి ఒక రాజసాన్ని ఇచ్చాయి. నిలువుగా ఉండే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ కారుకు ఒక ఆధునిక రూపాన్ని ఇవ్వగా, వైవిధ్యమైన రిమ్స్ కారు అందాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం జీటీ లైన్ వేరియంట్‌లో ఏకంగా 19 ఇంచ్ రిమ్స్ అందించడం విశేషం. ఇది కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ, లోపల ప్రయాణికులకు సరిపడా విశాలమైన స్థలం ఉండేలా కియా జాగ్రత్తలు తీసుకుంది.
ఇంటీరియర్ ఒక పిక్నిక్ బాక్స్
కారు లోపలి భాగాన్ని కియా ‘పిక్నిక్ బాక్స్’ థీమ్‌తో రూపొందించింది. అంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఒక సొంత గదిలో ఉన్నంత హాయిని ఈ కారు అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ విషయానికి వస్తే, ఇందులో టెక్నాలజీ ప్రియుల కోసం మూడు భారీ స్క్రీన్లు అమర్చారు. డ్రైవర్ సమాచారం కోసం ఒక స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ కోసం మరొకటి, అలాగే వినోదం మరియు మ్యాప్స్ కోసం ప్రధాన టచ్‌స్క్రీన్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 4-సీటర్ , 5-సీటర్ ఆప్షన్లు ఉండటం మరో ప్రత్యేకత. 4-సీటర్ వెర్షన్‌లో వెనుక సీట్లను ముందుకు జరుపుకోవడం ద్వారా సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కువ స్థలాన్ని కేటాయించుకోవచ్చు. దీనికి తోడు హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ఆహ్లాదకరంగా మారుస్తాయి.
పవర్ ఫుల్ బ్యాటరీ
ఈవీ2 కేవలం అందంలోనే కాదు, పనితీరులో కూడా సత్తా చాటుతోంది. కియా ఈ కారును రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో తీసుకువచ్చింది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ 317 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం లాంగ్ రేంజ్ వేరియంట్ సిద్ధంగా ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 448 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కనీసం ఒక కాఫీ తాగే సమయంలోనే అంటే కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం బ్యాటరీని నింపుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కారులోని బ్యాటరీతో ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను కూడా వాడుకునే వీ2ఎల్ టెక్నాలజీని ఇందులో జోడించారు.
భారత మార్కెట్ లో పోటీ ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతానికి కియా ఈవీ2 ధరలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 31 లక్షల రూపాయల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత మార్కెట్‌లోకి ఈ కారు అడుగుపెడితే, ఇక్కడి పోటీ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికే మార్కెట్లో పాగా వేసిన టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ , సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు కియా ఈవీ2 గట్టి సవాలు విసరనుంది. కియా బ్రాండ్ ఇమేజ్ , ఈ కారులోని అత్యాధునిక ఫీచర్లు భారతీయ వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని వాహన రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోవాలని కలలు కంటున్న వారికి కియా ఈవీ2 ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.

