Market Fall: ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి నిన్నటి భారీ లాభాల తర్వాత బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ఇంట్రాడేలో ఉన్నాయి. ఉదయం 11.33 గంటల సమయంలో సెన్సెక్స్ సుమారు 300 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 25,884 దగ్గర ట్రేడ్ అయింది. అయితే ఒక్క రాత్రిలో మార్కెట్లు లాభాల నుంచి నష్టాల్లోకి ఎందుకు జారుకున్నాయనే ఆందోళనలు చాలా మంది ఇన్వెస్టర్లలో కొనసాగుతున్నాయి. దీనికి గల కారణాలను నిశితంగా పరిశీలిస్తే..
ప్రధాన సెక్టర్లు అయిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, FMCG, ITలలో లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో వాటిపైనే నష్టభారం ఎక్కువగా పడింది. రూపాయి డాలర్ మారకపు విలువ నేడు 21 పైసలు క్షీణించి 88.40కి చేరింది. ఇదే క్రమంలో చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్లలో ఆందోళనలకు ముఖ్యమైన కారణాలుగా నిలిచాయి. అలాగే సోమవారం నాడు విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా అమ్మకాలకు దిగటం కూడా సెంటిమెంట్లను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.
మరీ ముఖ్యమంగా ఇవాళ US ఫెడ్ పాలిసీ నిర్ణయం రాబోతున్న క్రమంలో వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన ఉంటుందనే విషయంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. ఓలటిలిటీ ఇలా పెరగడంతో ఇండియా VIX సైతం 5% పెరిగి 12.50కి చేరింది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్ పైరీ ఉండటంతో ట్రేడింగ్ సెషన్ భారీ అనిశ్చితితో ట్రేడింగ్ కొనసాగిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
టెక్నికల్‌గా చూస్తే.. నిఫ్టీ సోమవారం స్థాయి అయిన 25,940-26,000 రేంజ్‌ను దాటి పైకి వెళ్లలేకపోయింది. 25,900 కంటే తక్కువ పడితే మరింత మందకొడికి అవకాశం ఉంటుంది. అయితే 25,590-25,400 రేంజ్‌లోకి పడిపోవడం తక్కువ అవకాశమే అని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి.. మంగళవారం రోజున భారత స్టాక్ మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్, విదేశీ పెట్టుబడిదారుల ఔట్‌ఫ్లోలు, రూపాయి విలువ క్షీణత, అంతర్జాతీయ సంకేతాలు, నెలవారీ ఎక్స్ పైరీ కలిసి మార్కెట్ ని నష్టాల దిశగా నడిపించాయి.


