Larry Ellison Overtakes Elon Musk as World’s Richest Man: అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఈ పేర్లు ప్రపంచ కుబేరుల జాబితాలో నిత్యం వినిపిస్తుంటాయి. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఆ జాబితాలోకి మరో పేరు చేరింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్ లారీ ఎల్లిసన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రపంచ కుబేరుడిగా కొనసాగిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇటీవల ఒరాకిల్ సంస్థ వెల్లడించిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. కేవలం ఒక్క రోజులోనే ఒరాకిల్ షేర్లు 41% పెరిగాయి. ఈ షేర్ల దూకుడుతో ఎల్లిసన్ సంపద ఏకంగా 101 బిలియన్ డాలర్లు (రూ. 8.41 లక్షల కోట్లు) పెరిగింది. ఈ ఒక్కరోజే సంపదలో ఇంత భారీ పెరుగుదల నమోదు కావడం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఇదే తొలిసారి.
ఈ అనూహ్య వృద్ధి ఫలితంగా ఎల్లిసన్ మొత్తం సంపద 393 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో మస్క్ (385 బిలియన్ డాలర్లు) ను అధిగమించి ఎల్లిసన్ అగ్రస్థానంలో నిలిచారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మరిన్ని వృద్ధి అంచనాలను ఒరాకిల్ ప్రకటించడంతో ఈ విజయ పరంపర కొనసాగే అవకాశం ఉంది.
ALSO READ: OYO: పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరు భలే ఉందిగా!
ఎల్లిసన్ సంపదలో ఎక్కువ భాగం ఒరాకిల్ సంస్థలో ఆయనకు ఉన్న వాటాలే. 81 ఏళ్ల వయసులో కూడా కంపెనీ ఛైర్మన్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో 2021లో ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన మస్క్.. ఆ తరువాత బెజోస్, ఆర్నాల్ట్‌ల చేతిలో ఆ స్థానాన్ని కోల్పోయారు. గత ఏడాది మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నా.. 300 రోజులు తిరగకుండానే ఎల్లిసన్ దాన్ని సొంతం చేసుకున్నారు.
మరోవైపు టెస్లా షేర్లు ఈ ఏడాది 13 శాతం మేర పడిపోయాయి. ఒకవేళ మస్క్‌కు ప్రతిపాదించిన భారీ ప్యాకేజీ అమలై, ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలిగితే, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ కుబేరుల పోరులో విజేతగా నిలిచి, అగ్రస్థానాన్ని అధిరోహించారు లారీ ఎల్లిసన్.
ALSO READ: UPI Payments: తగ్గుతున్న ఫోన్ పే, గూగుల్ పే యూజర్ల సంఖ్య.. ఆట మెుదలెట్టిన కొత్త కంపెనీలు


