LIC H1 Results 2025-26: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ.. 2025-26 ఆర్థిక అర్ధ సంవత్సరం(LIC H1 Results) ఫలితాలను గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 1, 2025 నుంచి.. సెప్టెంబర్ 30, 2025తో ముగిసిన ఆరు నెలలకు స్టాండ్అలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ అర్ధ సంవత్సరానికి నికర లాభం రూ. 21,040 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ. 18,082 కోట్లుగా ఉండగా.. నికర లాభంలో 16.36 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఎల్‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇక సెప్టెంబర్ 30, 2025తో ముగిసిన అర్ధ సంవత్సరానికి ఎల్‌ఐసీ మొత్తం మార్కెట్ వాటా 59.41 శాతంతో కొనసాగుతోంది. గతేడాది ఈ వాటా 61.07 శాతంగా ఉంది. కాగా, ఈ అర్ధ సంవత్సరానికి, ఎల్‌ఐసీ వ్యక్తిగత వ్యాపారంలో 37.21 శాతం, గ్రూప్ వ్యాపారంలో 72.74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు తెలిపింది.
Also Read: https://teluguprabha.net/business/unpacking-virat-kohlis-multi-million-dollar-business-empire/
మొత్తం ప్రీమియం ఆదాయం
ఏప్రిల్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు రెండు త్రైమాసికాలకు కలిపి ఎల్‌ఐసీ మొత్తం ప్రీమియం ఆదాయం రూ. 2,45,680 కోట్లు ఉంది. గతేడాది ఇదే సమయానికి రూ. రూ. 2,33,671 కోట్ల నమోదు చేసింది. దీంతో ఈ ఏడాది 5.14 శాతం వృద్ధిని నమోదు చేసింది.
వీటిలో వ్యక్తిగత కొత్త వ్యాపార ప్రీమియం ఆదాయం రూ. 28,491 కోట్లు ఉంది. గతేడాది ఇది రూ. 29,538 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం 3.54 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఈ అర్ధ సంవత్సరం గ్రూప్ వ్యాపార మొత్తం ప్రీమియం ఆదాయం అనూహ్యంగా రూ. 94,965 కోట్లు నమోదు చేసి 6.73 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గతేడాది ఇది రూ. 88,975 కోట్లుగా ఉంది.
వ్యక్తిగత విభాగంలో ఈ ఆర్థిక అర్ధ సంవత్సరంలో మొత్తం 72,60,573 పాలసీలు అమ్ముడయ్యాయి. గతేడాది ఆరు నెలల కాలానికి 91,70,420 పాలసీలను విక్రయించగా.. ఈసారి 20.83 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో ఇండియన్ ఎంబెడెడ్ వాల్యూ (ఐఈవీ) గతేడాదితో పోలిస్తే 1.03 శాతం తగ్గుదలను నమోదు చేస్తూ రూ. 8,13,230 కోట్లుగా ఉన్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. చివరిగా 13వ నెల, 61వ నెలకు ప్రీమియం ప్రాతిపదికన స్థిరత్వ నిష్పత్తులు వరుసగా 75.29 శాతం 63.81 శాతం ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది.


