Insurance : దేశీయ బీమా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో తన అద్భుతమైన ప్రదర్శనతో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది.
ఎల్‌ఐసీ ఈ త్రైమాసికంలో ఏకంగా రూ.10,053 కోట్ల నికర లాభాన్ని ప్రకటించి అదరగొట్టింది. గత సంవత్సరం ఇదే సమయంలో సాధించిన రూ.7,621 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 32 శాతం భారీ వృద్ధి. సంస్థ మొత్తం ఆదాయం కూడా రూ.2,29,620 కోట్ల నుంచి రూ.2,39,614 కోట్లకు పెరిగింది.
నికర ప్రీమియం వసూళ్లు రూ.1,26,479 కోట్లకు చేరుకున్నాయి.పునరుద్ధరణ ప్రీమియం వసూళ్లు రూ.61,910 కోట్ల నుంచి రూ.64,996 కోట్లకు పెరిగి, పాలసీదారుల విశ్వాసాన్ని చాటాయి.స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 1.34 శాతానికి తగ్గి, సంస్థ ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు స్పష్టం చేసింది.ఆస్తుల నిర్వహణ విలువ (AUM) 3.31% ఎగబాకి, ఏకంగా రూ.57.23 లక్షల కోట్లకు చేరింది.
లాభాలు, ఆస్తుల విషయంలో అదరగొట్టినా, మార్కెట్‌లో తన పట్టును కోల్పోవడం ఎల్‌ఐసీకి ఆందోళన కలిగించే విషయం.సంస్థ మార్కెట్ వాటా 60 శాతం నుంచి 59.41 శాతానికి తగ్గింది. ప్రైవేట్ బీమా సంస్థల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నట్లు ఇది సూచిస్తోంది.
ఎల్‌ఐసీకి అత్యంత కీలకమైన తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.11,201 కోట్ల నుంచి రూ.10,836 కోట్లకు పడిపోయాయి. కొత్త పాలసీలను జారీ చేయడంలో నెమ్మదిగా ఉన్నట్లు ఇది తెలియజేస్తుంది.కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం వసూళ్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం కూడా తమ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ఎల్‌ఐసీ పేర్కొంది.
మొత్తంగా చూస్తే, అటు లాభాల్లో దూసుకుపోతూనే, ఇటు మార్కెట్ వాటా, కొత్త ప్రీమియంల వసూళ్లలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఎల్‌ఐసీ… భవిష్యత్తులో ఈ బలహీనతలను ఎలా అధిగమించి మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో చూడాలి.


